
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాఢ మాసం కామిక ఏకాదశి సోమవారం రోజున( జులై 21 ) వృద్ధి యోగం...సర్వార్థ సిద్ది యోగం.... అమృతసిద్ది యోగం.. అనే మూడు యోగాలు కలిసి ఏర్పడనున్నాయి. అందుకే ఆ రోజు ( జులై 21) అసాధారణమైనది శక్తివంతమైనది పవిత్రమైనదని పండితులు చెబుతున్నారు. ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి.. ఈ యోగాలలో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం...
జ్యోతిషశాస్త్రం ప్రకారం విశ్వావశునామ సంవత్సరం జులై 21 సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఆరోజు తిథి ఆషాఢమాసం కృష్ణపక్షం ఏకాదశి . పురాణాల ప్రకారం కామికా ఏకాదశి చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఇంకా జులై 21వ తేదీన మూడు శుభప్రదమైన, అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. కామిక ఏకాదశి సోమవారం నాడు మూడు అరుదైన యోగాలు ఏర్పడినప్పుడు పరమేశ్వరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ( 2025) కామిక ఏకాదశి సోమవారం రోజు వృద్ధి యోగంతో పాటు అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం మూడూ ఉన్నాయి. ఆరోజున పరమేశ్వరుడిని పూజిస్తే ఆర్థిక శ్రేయస్సు, ఐశర్య వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధి యోగం శుభ కార్యాలకు చాలా అనుకూలంగా ఉంటుందట. ఈ యోగంలో చేసే పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని పురాణాల ద్వారా తెలుస్తుంది.
సర్వార్థ సిద్ధి యోగంలో పరమేశ్వరుడిని కోరిన కోరికలు నెరవేరడానికి, పనిలో విజయం చేకూరడానికి శుభ యోగంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రారంభించిన ఏ శుభ కార్యానికైనా అడ్డంకులు ఉండవు. విజయనానికి మార్గం సుగమమవుతుంది.
అమృత సిద్ధి యోగం.. అత్యంత పవిత్రమైనది... శక్తివంతమైనది. ఈ యోగంలో ఉన్నప్పుడు చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో చేసే పూజలు వ్యక్తికి దీర్ఘాయువు, ఆరోగ్యం, శ్రేయస్సు కలుగజేస్తాయని నమ్మకం.
ఇక ఈ ఏడాది ( 2025) ఆషాడ మాసం కామిక ఏకాదశి సోమవారం రోజున వృద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం 3 యోగాలు కలిసి ఏర్పడటం వలన ఈరోజు చాలా శక్తివంతమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. పూజలు, దోష పరిహారాలు చేస్తారు. ఈరోజు దోష పరిహారాలు పాటించడం వల్ల రెట్టింపు ఫలితాలు ఉంటాయని నమ్ముతారు.
శివుడిని ఎలా పూజించాలి..
- బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాల అనంతరం.. పరమేశ్వరునికి అభిషేకం చేయాలి.
- బిల్వ పత్రం, ఉమ్మెత్త, జమ్మి పత్రాలను వంటివి సమర్పించడం మంచిది.
- ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపం చేయాలి.
- శివ చాలీసా, రుద్రాష్టకం, మహామృత్యుంజయ మంత్రం పఠించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
- దానధర్మాలు చేయడం వల్ల గ్రహ దోషాలు, ప్రతికూలతలు తొలగిపోతాయని చెబుతారు.
ఇక ఆ రోజు ఏకాదశి కాబట్టి లక్ష్మీనారాయణులను కూడా పూజించాలి
- కామికా ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి.
- ఉతికిన బట్టలు వేసుకుని, ఇంట్లో పూజా గదిని శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి.
- ఒక ఎర్రని వస్త్రంపై బియ్యంపై విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
- శ్రీహరికి పువ్వులు, తులసిదళాలను సమర్పించాలి.
- పంచామృతం... గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేయాలి.
- స్వామికి పసుపు, చందనం, పసుపు రంగు పువ్వులు సమర్పించాలి.
- ఆవు నెయ్యితో దీపారాధన చేసి, కామికా ఏకాదశి వ్రతం కథ, మంత్రాలను చదవాలి.
- చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
- ఈరోజంతా ఉపవాసం ఉండాలి. మరుసటిరోజు ఉపవాసాన్ని విరమించాలి.
- ద్వాదశి రోజు బ్రాహ్మణుడికి దక్షిణ.. స్వయంపాకం ఇవ్వాలి. ఆ తరువాతే ఉపవాస దీక్షను విరమించాలి.
కామిక ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని, వారి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. పూర్వీకుల ఆశీస్సులు పొందిన వ్యక్తి జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు కచ్చితంగా పొందుతారు. ఈ పవిత్రమైన రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే ఈరోజున మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి.