రేపు స్వగ్రామంలో కత్తిమహేష్ అంత్యక్రియలు

రేపు స్వగ్రామంలో కత్తిమహేష్ అంత్యక్రియలు

హైదరాబాద్: ఏపీలోని నెల్లూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందిన కత్తి మహేష్ అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. చిత్తూరు జిల్లా యర్రవారిపాలెం మండలంలోని యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు జరపాలని నిర్ణయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరులో కత్తి మహేష్ జన్మించారు. తండ్రి వ్యవసాయ అధికారి ఉద్యోగి కావడంతో విద్యాభ్యాసం పలుచోట్ల  సాగింది. మైసూరులో డిగ్రీ పూర్తి చేసిన కత్తి మహేష్ అటు తర్వాత హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేశారు. 
సినిమాలపై చిన్నప్పటి నుంచే ఆసక్తి. సొంతూరుకు దగ్గరలో ఉన్న మదనపల్లె, తిరుపతికి వెళ్లి రిలీజ్ రోజే సినిమాలు చూసేవాడట. వేసవిలో స్కూళ్లకు సెలవులొస్తే రోజుకో సినిమా చూడాల్సిందే. అంటే సినిమాలంటే అంత పిచ్చి అన్నమాట. సినిమా టాపిక్ లపై అందరూ మాట్లాడే మాటలను విశ్లేషిస్తూ.. మళ్లీ మళ్లీ చూసేవాడట. సినిమాల పిచ్చితో చదువు అయిపోగానే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దగ్గర ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసి ‘‘రాఘవేంద్ర మహత్యం’’ అనే సీరియల్ కు పనిచేశారు. జీతం డబ్బులు సరిపోక మళ్లీ సొంతూరుకు వెళ్లి రెండు మూడు ఉద్యోగాలు చేశారు. అటు తర్వాత మళ్లీ సినిమాలవైపు వచ్చాడు. 
కత్తి మహేష్ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా బెంగాలీ యువతి పరిచయం ప్రేమగా మారి పెళ్లి జరిగింది. వీరి ప్రేమకు చిహ్నంగా కత్తి మహేష్ దంపతులకు బాబు జన్మించాడు. గత ఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయాల్లో ప్రవేశించాలని ఆలోచించినా ఎందుకో కార్యరూపంలోకి రాలేదు. అయితే వైఎస్ జగన్ పట్ల అభిమానం చూపడంతో.. ఆయనకు ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ కూడా స్పందించి వైద్య చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.17 లక్షలు విడుదల చేశారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్ప చేస్తుండగా కోలుకున్నట్లే కనిపించిన ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఫిలిం క్రిటిక్ గా... ముక్కుసూటి విశ్లేషణలతో అందరికీ చిరపరిచుతుడిగా మారిన ఆయన హఠాన్మరణం పాలు కావడం  సినిమా ప్రముఖులు, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.