1,300 మంది ఆర్టీసీ కార్మికులను మళ్లీ డ్యూటీలోకి తీస్కోండి : కవిత

1,300 మంది ఆర్టీసీ కార్మికులను మళ్లీ డ్యూటీలోకి తీస్కోండి : కవిత
  • ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి కవిత వినతి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో చిన్న చిన్న కారణాలతో 2021 నుంచి ఇప్పటిదాకా తొలగించిన 1,300 మంది డ్రైవర్లు, కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం ఆమె బస్‌‌‌‌భవన్‌‌‌‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..ఉద్యోగం పోయి కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను శిక్షణ పొందిన డ్రైవర్లే నడపాలని, ప్రైవేటు డ్రైవర్లతో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగం నుంచి తొలగించిన 1,300 మందిలో 491 మందిని విధుల్లోకి తీసుకుంటామని గతంలోనే ఉత్తర్వులిచ్చినా.. ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. 

అసలు వారిని ఉద్యోగంలోకి మళ్లీ తీసుకునే ఉద్దేశమే లేదని ఆర్టీసీ ఎండీని కలిశాక అర్థమైందని చెప్పారు. వెంటనే ఆ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. మిగతా కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​చేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అప్పుడే ప్రజలకు భద్రత, కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని పేర్కొన్నారు. కాగా..ఎండీకి ఇచ్చిన వినతిపత్రంలో కవిత తన హోదాను “మాజీ ఎంపీ”గా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆమె ఎమ్మెల్సీ లెటర్‌‌‌‌హెడ్ వాడటం మానేశారు. కవిత ఇకపై మాజీ ఎంపీ లేదా తెలంగాణ జాగృతి లెటర్‌‌‌‌హెడ్‌‌‌‌తోనే లేఖలు ఇస్తారని జాగృతి వర్గాలు తెలిపాయి.