ఇస్లామాబాద్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని మొదటి వారం అంతా లైట్ తీసుకున్నారు. యుద్ధ ప్రభావం కూడా ప్రపంచ దేశాలపై పెద్దగా చూపించలేదు. కానీ వార్ రెండో వారంలోకి ప్రవేశించిన తర్వాత దాని ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై క్రమంగా పడుతోంది. మిడిల్ ఈస్ట్‌లో.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచం ఇంధన సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఇంధన సంక్షోభం భారత పొరుగు దేశం పాకిస్తాన్‌పైన తీవ్రంగా పడింది.
చమురు సంక్షోభంతో దాయాది దేశం అతలాకుతలం అవుతోంది. దీంతో ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండు వారాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు వారంలో నాలుగు రోజులు పని చేస్తాయని తెలిపారు. అలాగే.. రెండు నెలల పాటు ప్రభుత్వ శాఖల వాహనాలకు 50 శాతం ఇంధన కోత విధించారు.
అంబులెన్స్‌లు, ప్రజా రవాణా బస్సులకు ఈ ఇంధన కోతలు ఉండవని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ వాహనాల్లో 60 శాతం రెండు నెలల పాటు నిలిపివేయబడతాయని తెలిపారు. క్యాబినెట్ సభ్యులు, మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల రెండు నెలల జీతాలు కోత విధిస్తున్నామన్నారు. అలాగే, పార్లమెంటు సభ్యులందరికీ 25 శాతం జీతంలో కోత ఉంటుందని తెలిపారు. ఇక, రూ.3 లక్షల కంటే ఎక్కువ సంపాదించే గ్రేడ్ 20, అంతకంటే పై స్థాయి అధికారులకు రెండు రోజుల జీతం తగ్గించబడుతుందని పేర్కొన్నారు.
ఈ వేతనం ప్రజా ఉపశమనం కోసం ఉపయోగించబడుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖ ఖర్చులలో 20 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో వాహనాలు, ఫర్నిచర్, ఏసీలు, ఇతర వస్తువుల కొనుగోలుపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్ల విదేశీ పర్యటనలపై నిషేధం ఉంటుందని.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అనివార్యమైన సందర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
