- నకిలీ మెడిసిన్ల కట్టడికి డీసీఏ చర్యలు
హైదరాబాద్, వెలుగు: నకిలీ, నాణ్యత లేని మెడిసిన్ల అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ సాయంతో నకిలీ మెడిసిన్లను గుర్తించేందుకు బల్క్ ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్ ను ప్రారంభించింది. దీనిద్వారా ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ లాబొరేటరీ నిర్వహించే క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయితే.. ఆ మెడిసిన్ వివరాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ మెడికల్ షాపులు, హోల్ సేల్ ఫార్మసీల మొబైల్స్ కు క్షణాల్లో ఎస్ఎంఎస్ ద్వారా చేరవేస్తారు.
డీసీఏ అధికారుల నుంచి అలర్ట్ మెసేజ్ అందిన వెంటనే సదరు ఫార్మసీ, మెడికల్ షాప్ యాజమాన్యాలు ఆ బ్యాచ్ మందుల అమ్మకాలను నిలిపివేయాల్సి ఉంటుంది. మార్కెట్ లో నకిలీ, నాణ్యతలేని మెడిసినట్ల బెడద ఎక్కువైంది. వీటి వల్ల జబ్బు నయం కాకపోగా.. ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున డీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. బల్క్ ఎస్ఎంఎస్ టెక్నాలజీతో నాణ్యతా లోపం ఉన్న మందులు పేషెంట్లకు చేరకముందే.. మార్కెట్ నుంచి వేగంగా వెనక్కి రప్పించడానికి వీలవుతుందని డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం తెలిపారు. ఈ తరహా ప్రో-యాక్టివ్ ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్ ను విజయవంతంగా అమలు చేస్తున్న దేశంలోని అతికొద్ది రాష్ట్రాలో తెలంగాణ ఒకటని డీసీఏ పేర్కొంది.
