- ఇక నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తామని వెల్లడి
వరంగల్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్ట్నేతలు జనం బాట కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దశాబ్దాల క్రితం తమతో కలిసి పనిచేసినవారి కుటుంబాలను కలిసి సమావేశమయ్యారు. మావోయిస్ట్పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జిగా వ్యవహరించిన తక్కళ్లపల్లి వాసుదేవరెడ్డి అలియాస్ ఆశన్న 5 నెలల క్రితం ఛత్తీస్‍గఢ్ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఆయనతోపాటు మావోయిస్ట్ నేతలు శ్యామ్ దాదా, యాదగిరి అలియాస్ రాజ్‍మన్, భాస్కర్, వెంకటేశ్, పద్మ, చంప, శ్యామ్, ప్రణీత, సంతోష్, అర్జున్, వికాస్ జనజీవన స్రవంతిలో కలిశారు.
సోమవారం కాజీపేట మండలం భట్టుపల్లిలో మాజీ మావోయిస్టు నేతలంతా అమరవీరుల కుటుంబాలతో సమావేశమయ్యారు. గతంలో భట్టుపల్లి కేంద్రంగా పనిచేసినప్పటి అనుభవాలను గ్రామస్తులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆశన్న మాట్లాడుతూ ఇక నుంచి ప్రజలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రజా, కుల సంఘాలతో కలిసి పనిచేస్తామన్నారు. మరోవైపు మాజీ మావోయిస్ట్ నేతలు భట్టుపల్లికి వచ్చారనే సమాచారంతో నిఘా వర్గాలు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించాయి.
