అమ్మకాలు పూర్తయ్యాక కాంటాలా? : జాగృతి అధ్యక్షురాలు కవిత

అమ్మకాలు పూర్తయ్యాక కాంటాలా? : జాగృతి అధ్యక్షురాలు కవిత
  • కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లే: జాగృతి అధ్యక్షురాలు కవిత

బాల్కొండ, వెలుగు: మక్కలు 80 శాతం అమ్మకాలు పూర్తయ్యాక ఇప్పుడు కాంటాలు పెడితే ఏం లాభమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. బుధవారం నిజామాబాద్​ జిల్లా భీంగల్ లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తడిసిన వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొంటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బోధన్ లోని యంచ గ్రామానికి వెళ్లిన తర్వాత కలెక్టర్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేశారని.. అలాగే, అన్ని చోట్లకు వెళ్లాలని కోరారు. 

స్థానిక ఎమ్మెల్యే ముంపు గ్రామాలను సందర్శించి పరిహారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ప్రతిపక్షాలు కూడా కనీసం ప్రభుత్వాన్ని నిలదీస్తలేవని విస్మయం వ్యక్తం చేశారు. భీంగల్ ప్రాంతానికి రాష్ట్రంలో కీలకమైన కాంగ్రెస్  లీడర్లు ఉన్నారని.. భీంగల్ మండలానికి చెందిన పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గంలో మరో ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఎవరన్నది పక్కన పెడితే రూలింగ్ పార్టీదే నడుస్తోంద‌‌‌‌న్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా లింబాద్రి స్వామి ఆశీస్సుల కోసం వచ్చానని.. దేవుడి దయ వల్ల నిజామాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు కవిత చెప్పారు. పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె కోరారు.