
- కుర్చీ, కుటుంబం కోసం ఎంతకైనా దిగజారుతడు: కిషన్‌రెడ్డి
- మోడీ సారథ్యంలో కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాం
- కేంద్ర కేబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ప్రాధాన్యం: కేంద్ర మంత్రి
జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలిచేందుకు రూ.1000 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. దుబ్బాక బై ఎలక్షన్లో అక్రమాలకు పాల్పడ్డారు. హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలిచేందుకు మళ్లీ అదే వైఖరి. కేసీఆర్‌కు బానిసలుగా ఉండేవారు మాత్రమే కావాలి. ఆత్మగౌరవంతో వ్యవహరించే ఈటలను కేసీఆర్ ఉద్దేశ పూర్వకంగా బయటకు పంపారు.
– కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
గురువారం కోదాడలో జరిగిన జన ఆశీర్వాద సభలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు మురళీధర్ రావు, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి తదితరులు
కోదాడ/సూర్యాపేట, వెలుగు: కుర్చీ కోసం, కొడుకు, కుటుంబం కోసం ఎంతకైనా దిగజారే సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు షాక్ ట్రీట్‌మెంట్‌ఇవ్వాల్సిన టైమ్ వచ్చిందని.. ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో దివాలా తీసిందని, ఆయనకు అధికారంలో ఉండాలనే ధ్యాస తప్ప ప్రజల మేలు, వారి సమస్యలు పట్టడం మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేసినా..
టీఆర్ఎస్ పాలనలో వారి ఆశయాలు నెరవేరడం లేదన్నారు. సీఎంగా కేసీఆర్ తనకున్న అధికారాన్ని స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏడేండ్లుగా దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో కరోనా కట్టడి, వ్యాక్సిన్ల తయారీ, మహమ్మారిని నియంత్రంచడం మోడీ నాయకత్వంతోనే సాధ్యమైందన్నారు. కరోనా సమయంలోనూ పేదలు ఇబ్బందులు పడకుండా ఉచితంగా బియ్యం, ఆత్మ నిర్భర్ ద్వారా చిరు వ్యాపారులు నిలదొక్కుకునేందుకు చేయూత అందించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కేంద్ర కేబినెట్‌లో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు పెద్దపీట వేశారన్నారు. కేంద్ర కేబినెట్‌మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలిపేందుకు, ప్రధాని మోడీ సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు జన ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన అక్కడ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. యాత్రలో బీజేపీ స్టేట్ చీఫ్బండి సంజయ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ కోర్ కమిటీ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎన్. రామచంద్రరావు, సంకినేని వెంకటేశ్వర్రావు, మంత్రి శ్రీనివాస్, గుజ్జుల ప్రమేందర్‌రెడ్డి, బంగారు శృతి, బొబ్బా భాగ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎందరు: సంజయ్
సీఎం కేసీఆర్ తన కేబినెట్‌లో ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారో లెక్క చెప్పాలని పార్టీ స్టేట్ చీఫ్ సంజయ్ డిమాండ్ చేశారు. తన కొడుకు, బిడ్డ, అల్లుడికి తప్ప రాష్ట్రంలో మరెవరికీ పదవులు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇన్నాళ్లు ఫాంహౌస్, ప్రగతి భవన్‌కే పరిమితమైన కేసీఆర్.. బీజేపీ వల్లనే ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాడన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. అందుకోసం పార్టీ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ఆర్టికల్370 రద్దు, సీఏఏ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆయన పనితీరును గమనించిన ప్రధాని నరేందర్ మోడీ కేంద్ర కేబినెట్‌మంత్రిగా పదోన్నతి కల్పించారన్నారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో పని చేసిన కిషన్‌రెడ్డి.. కేంద్ర మంత్రిగా ఎదగడం బీజేపీ పార్టీ వల్లనే సాధ్యమైందన్నారు. ప్రధాని మోడీ కేబినెట్‌లో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారని
అన్నారు.