మూడునాలుగేండ్లలో కోటి 25 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం: కేసీఆర్

మూడునాలుగేండ్లలో కోటి 25 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం: కేసీఆర్
  • రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతూనే ఉంటది: కేసీఆర్ 
  • కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టుల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తం 
  • డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ
  • రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందని కుటుంబమే లేదన్న సీఎం
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్​లో జాతీయ సమైక్యతా దినోత్సవం 

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ఇది మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్​ వినియోగం, 24 గంటల ఉచిత వ్యవసాయ కరెంట్, ప్రతి ఇంటికీ మిషన్​ భగీరథ మంచినీళ్లు, తలసరి ఆదాయం.. ఇలా అన్నింటిలోనూ తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎదిగిందని చెప్పారు. ప్రజల దీవెనతో ఈ అభివృద్ధి మరింత జోరుగా ముందుకు సాగుతుందని, దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించే వాళ్లకు ఓటమి తప్పదని అన్నారు. 

Also Rard: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ఓ చారిత్రాత్మక రోజు : ప్రభుత్వ విప్ సుంకరి రాజు

ఆదివారం హైదరాబాద్​లోని పబ్లిక్​గార్డెన్​లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గన్​పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. తర్వాత పబ్లిక్​ గార్డెన్​కు చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు.

‘‘దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నది. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతున్నది. మన సమైక్యతే మనకు బలం. ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దాం” అని పిలుపునిచ్చారు. “తెలంగాణ ఆచరిస్తున్నది.. -దేశం అనుసరిస్తున్నది’ అన్నమాట అక్షర సత్యం. ఇతర రాష్ట్రాలు మన పథకాలను అనుసరిస్తున్నాయి. తెలంగాణలో సాగుతున్న సుపరిపాలన తమ రాష్ర్టాల్లోనూ కావాలని అక్కడి  ప్రజలు కోరుకుంటున్నారు” అని పేర్కొన్నారు. 

ఇండ్లు రాలేదని ఆందోళన చెందొద్దు.. 

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయని కేసీఆర్ అన్నారు. ‘‘ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందని కుటుంబమే లేదని చెప్పొచ్చు. ప్రభుత్వ పథకాల ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. 2015–18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం.. 2019–21 నాటికి 5.88 శాతానికి తగ్గింది. మరోవైపు తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది” అని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం నిరంతరం కొనసాగే  ప్రక్రియ అని చెప్పారు. ‘‘హైదరాబాద్ లో నిర్మించిన దాదాపు లక్ష ఇండ్లను పేదలకు పంపిణీ చేస్తున్నం. ఎవరైనా అర్హులకు ఇప్పుడు ఇల్లు రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగుతుంది” అని పేర్కొన్నారు. 

కాళేశ్వరం కంప్లీట్ చేసి 45 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం.. 

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాల ప్రజల ఆశలు నెరవేరుతాయని కేసీఆర్ అన్నారు. ‘‘నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది” అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ‘‘ఖమ్మం జిల్లాలో 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని నుంచి నీటిని ఎత్తిపోసే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త, పాత ఆయకట్టు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. కాబట్టి దేవాదుల ఎత్తిపోతల ద్వారా త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. అంటే రాష్ట్రంలో ప్రధానమైన ఎత్తిపోతల పథకాల ద్వారానే 75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే  85 లక్షల ఎకరాలకు సాగు నీరందుతున్నది. రానున్న మూడు నాలుగేండ్లలో మొత్తం కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరుతుంది” అని చెప్పారు. 

15 నిమిషాల్లోనే అంబులెన్స్​లు వస్తున్నయ్.. 

పదేండ్లలోనే కొత్తగా 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి చరిత్ర సృష్టించామని కేసీఆర్ అన్నారు. ‘‘2014లో ప్రభుత్వ, ప్రైవేట్​రంగంలో కలిపి మొత్తం 2,850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు మూడింతలు పెరిగాయి. ప్రతిఏటా పది వేలమంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటున్నది. 108, 104 అంబులెన్స్ ల కోసం కొత్తగా 466 వాహనాలు ప్రారంభించాం. ఇప్పుడు ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ లు వస్తున్నాయి” అని చెప్పారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట లాంటి ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించి ఐటీ టవర్లు నిర్మించామన్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియా అని.. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో కలసిమెలసి బతుకుతున్నారని పేర్కొన్నారు. 

జాతీయ సమైక్యతనే కరెక్టు.. 

సెప్టెంబర్ 17న తెలంగాణలో రాచరికం పోయి, ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైందని.. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడమే సముచితమని కేసీఆర్ అన్నారు. ‘‘ఆనాటి ప్రజాపోరాట ఘట్టాలు, సామాన్యులు చేసిన త్యాగాలు.. జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. దొడ్డి కొమురయ్య నుంచి చాకలి ఐలమ్మ దాకా, కుమ్రంభీమ్ నుంచి రావి నారాయణరెడ్డి దాకా, షోయబుల్లాఖాన్ నుంచి సురవరం ప్రతాపరెడ్డి దాకా, స్వామి రామానందతీర్థ నుంచి జమలాపురం కేశవరావు దాకా, బండి యాదగిరి నుంచి సుద్దాల హనుమంతు, కాళోజీ, దాశరథి దాకా ఎందరెందరో వీర యోధులు ఉన్నారు. వాళ్లందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను” అని పేర్కొన్నారు.