వీసీల రాజీనామా కోరే అధికారం గవర్నర్ కు లేదు: కేరళ సీఎం

వీసీల రాజీనామా కోరే అధికారం గవర్నర్ కు లేదు: కేరళ సీఎం

తొమ్మిది మంది  వీసీలు  రాజీనామా చేయాలన్న గవర్నర్ ఆదేశాలపై  కేరళ సీఎం పినరయి విజయన్  స్పందించారు. గవర్నర్ కు అటువంటి అధికారం లేదని.. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ పదవి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడం కాదన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ "యుద్ధం" చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ సంఘ్‌ పరివార్‌కు  ధీటుగా వ్యవహరిస్తున్నారన్నారు.

తొమ్మిది మంది యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ రాజీనామాలు తనకు చేరాలని నిర్దేశించారు. యూజీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ రిక్రూట్ మెంట్ ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 9మంది వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ సంచలన ట్వీట్ చేశారు. 9 యూనివర్సిటీల పేర్లను కూడా ట్వీట్ లో మెన్షన్ చేశారు.  

కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తానే తప్ప రాజీనామా చేయనని కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపీనాథ్ రవీంద్రన్ స్పష్టం చేశారు. వీసీ రాజీనామా అనేది అతని ఆర్థిక అవకతవకలు, చెడు ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని, కానీ ఇక్కడ అలాంటి ఘటనలేమీ జరగలేదని చెప్పారు. తనపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు అన్నారు. కన్నూర్ వీసీగా తన నియామకానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉందని రవీంద్రన్ చెప్పారు. కోర్టులో కేసు ఉన్నపుడు వీసీ పదవి నుంచి ఛాన్స్ లర్ ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.

మరో వైపు రాజీనామా చేయాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ  9మంది వీసీలు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ సాయంత్రం కేరళ హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది.  మరోవైపు సీపీఎం  నేత సీతారామ్ ఏచూరి కూడా గవర్నర్ తీరు పై ఫైర్ అయ్యారు.  రాజీనామా చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం గవర్నర్ కు లేదన్నారు. ఉన్నత విద్యా వ్వవస్థను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు RSS కార్యకర్తల్ని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గవర్నర్ ఆదేశాలపై కోర్టును ఆశ్రయిస్తామని  ఏచూరి అన్నారు.