21న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

21న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా..  కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్ తీసుకువచ్చేందుకు పార్టీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరుస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. అధ్యక్ష మార్పుతో తెలంగాణ కమల దళంలో ఒక్కసారిగా నిశబ్ద వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో పార్టీ చీఫ్ గా నియమితులైన కిషన్ రెడ్డి విదేశీ టూర్ కు వెళ్లడంతో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సైతం సందడి లేకుండా పోయింది. ఇక చేరికలు అనేవే లేకుండా పోయాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే ఊపును తిరిగి తీసుకువచ్చేందుకు దూకుడు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కిషన్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 20 నుంచి వరుస కార్యక్రమాలకు రాష్ట్ర కమిటీ ప్లాన్ చేస్తున్నది. 

20న డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలన కోసం కిషన్ రెడ్డి భారీ కాన్వాయ్ తో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బాట సింగారం గ్రామానికి వెళ్లనున్నారు. ఆ మరుసటి రోజు (21న) రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడిగా బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసు వద్ద సభను ఏర్పాటు చేస్తున్నారు. 22న పార్టీ కోర్ కమిటీ  సమావేశం జరుగనుంది. 24న అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు. 25న ఇందిరా పార్కు వద్ద రాష్ట్ర స్థాయి ఆందోళన జరుగనుంది. 26, 27, 28 తేదీల్లో జిల్లాల పర్యటనకు కిషన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. 

29న ఖమ్మంలో అమిత్ షా సభ

29న ఖమ్మంలో సభ నిర్వహించనున్నారు. దీనికి అమిత్‌‌‌‌ షా హాజరుకానున్నారు. ఈ సభతో క్యాడర్లో కొత్త జోష్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అమి త్ షా సభ తర్వాత కూడా అదే జోష్ ను కొనసాగించేందుకు 100 రోజుల ప్రణాళికను కొనసాగించనున్నది. ఇందులో భాగంగా జనం వద్దకు వెళ్లే ప్రోగ్రామ్ లు చేపట్టేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ఏదో ఒక సమస్యపై నిత్యం జనంలో ఉండడమే లక్ష్యంగా ఆ పార్టీ ఆందోళన బాట పట్టనున్నది. రేషన్ కార్డులు, ధరణిపై.. ఇలా పేదల ఎజెండాతో బీజేపీ జనంలోకి వెళ్లనున్నది.