
- బీఆర్ఎస్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్
- ఓ చేతిలో ఆసరా పింఛన్, మరో చేతిలో మద్యం సీసా పెట్టి డబ్బులు గుంజుకుంటున్నది
- మద్యం, భూములు అమ్మితే తప్ప ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని విమర్శ
- బీజేపీలో చేరిన డాక్టర్ వికాస్ రావు, దీప దంపతులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రజలతో విచ్చలవిడిగా మద్యం తాగిస్తూ, బీఆర్ఎస్ సర్కార్ వారి రక్తాన్ని తాగుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఓ చేతిలో ఆసరా పెన్షన్డబ్బులు పెట్టి, మరో చేతిలో మద్యం బాటిల్ పెట్టి... ఇచ్చిన డబ్బులను ఇచ్చినట్టే లాగేసుకుంటోందని విమర్శించారు. బుధవారం పార్టీ స్టేట్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ వికాస్ రావు, కోడలు దీప బీజేపీలో చేరారు.
కిషన్ రెడ్డి వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో భూములు, మద్యం అమ్మనిదే.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. చివరకు రోజువారీ ఖర్చుల కోసం కూడా భూములను వేలం వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ‘‘దేశంలో ఎక్కడాలేని విధంగా ఆరు నెలల ముందే మద్యం షాపులకు టెండర్లు వేసి, ఎన్నికల కోసం డబ్బులు కూడబెట్టారు. జనం మద్యానికి బానిసై కుటుంబాలు ఆగమవుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. బీఆర్ఎస్ సర్కార్ కు కావాల్సింది ఆదాయం మాత్రమే” అని ఆయన విమర్శించారు. ‘‘రాష్ట్రంలో వేలాది బెల్ట్ షాపులు పెట్టారు.
కేసీఆర్ప్రభుత్వం బెల్ట్‌షాపుల ద్వారా అర్ధరాత్రి కూడా మద్యం అమ్మి ప్రజలను దోపిడీ చేస్తోంది. గత ప్రభుత్వాలు భవిష్యత్తు అవసరాల కోసం భూములను కాపాడేవి. కానీ ఈ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములను అమ్ముతోంది. చివరకు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డును కూడా తాకట్టు పెట్టింది. కరెంటు, ఆర్టీసీ చార్జీలు, భూముల రిజిస్ట్రేషన్, ఇంటి పన్ను ఇలా.. అన్ని రకాల చార్జీలను పెంచి ప్రజలను దోచుకుంటోంది” అని ఫైర్ అయ్యారు. ‘‘ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోంది. ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మద్యాన్ని ఏరులై పారిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించాలి” అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆ మూడు పార్టీలు ఒక్కటే..
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక ఒప్పందం కుదుర్చుకొని.. పార్టీల ఆఫీసులకు విలువైన భూములు తీసుకున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘‘కేంద్రం చేపడ్తున్న అభివృద్ధి పనులకు భూములు ఇవ్వమంటే కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టేందుకు స్థలం లేదంటోంది. కానీ తమ పార్టీకి, తమకు అనుకూలమైన పార్టీల ఆఫీసులకు విలువైన స్థలం కేటాయించింది” అని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని, వీటి రెండింటికి మధ్యవర్తి ఎంఐఎం పార్టీ అని విమర్శించారు. కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదని.. పైగా కేంద్రం సిలిండర్ ధరలు తగ్గిస్తే విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో బీజేపీతోనే మార్పు సాధ్యం. అలాంటి మార్పు కోసమే వికాస్ రావు దంపతులు బీజేపీలో చేరారు. రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నోళ్లందరూ బీజేపీలోకి రావాలి” అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజలకు మరింత సేవ చేస్తం: వికాస్ రావు
ప్రజలకు మరింత సేవ చేసేందుకే బీజేపీలో చేరామని వికాస్ రావు తెలిపారు. ‘‘బీజేపీ అగ్ర నేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి పెద్దల ప్రభావం చిన్నప్పటి నుంచే నాపై ఉంది. బీజేపీలో చాలామంది పెద్దలతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఈ రోజు బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. నేను, నా భార్య ఎన్నో రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలకు మరింత సేవ చేసేందుకే బీజేపీలో చేరాం. రానున్న రోజుల్లో పార్టీ నాకు అప్పగించే బాధ్యతలను నిర్వర్తిస్తాను” అని చెప్పారు.
ఈసారి గెలుపు మాదే: సంజయ్
అమిత్‌షా సభతో తమ సత్తా ఏంటో చూపించామని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు తమదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. మోదీ పాలన నచ్చి, ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో వికాస్ రావు దంపతులు పార్టీలో చేరారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. వికాస్ రావు దంపతుల చేరికతో ఉత్తర తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని ఎంపీ అర్వింద్ అన్నారు.