- సీఎం రేవంత్, కేసీఆర్ రావాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో నిరూపిస్త
- డిబేట్‌కు చొరవ చూపాలని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడికి లేఖ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై ఓపెన్ డిబేట్‌కు తాను సిద్ధమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదని ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. ఇందుకోసం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వేదిక ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని.. ప్రధాని మోదీపై తప్పుడు విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్రపై ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉంది.
అందుకే తెలంగాణకు గత పదేండ్లలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు మంజూరు చేశామనే విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ అంశాలపై ‘తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర’ పేరుతో ఇప్పటికే నివేదిక కూడా విడుదల చేశాం. రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర సహకారంపై రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వేదిక ఏర్పాటు చేయాలి. తేదీ, సమయం నిర్ణయించి వాళ్లిద్దరినీ ఆహ్వానించాలి. ఈ చర్చ సజావుగా సాగేందుకు సీఎం, మాజీ సీఎం మాట్లాడే భాష ప్రెస్‌క్లబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, పార్లమెంటరీ పద్ధతిలో ఉండాలి. వ్యక్తిగత దూషణలు, అసహ్యపు మాటలు లేకుండా సానుకూల చర్చ జరిగేలా చూడాలి. ఈ డిబేట్ ద్వారా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా మీడియా ముందు చర్చకు చొరవ తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.
