- కోహెడకు తరలించి నిర్మాణం చేపట్టకుండా వదిలేసిన గత బీఆర్ఎస్ సర్కారు
- షెడ్లు కూలిపోవడంతో బాటసింగారంలోనే నిర్వహణ
- ప్రైవేట్ సంస్థకు ఏటా రూ.8.40 కోట్ల అద్దె
- కోహెడలో నిర్మాణం చేపట్టాలని డిమాండ్.. కొత్త సర్కారు డీపీఆర్
హైదరాబాద్, వెలుగు: గడ్డి అన్నారం ఫ్రూట్‌మార్కెట్ గత నాలుగేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. 1986 నుంచి కొత్తపేటలోని 22 ఎకరాల్లో కొనసాగిన ఫ్రూట్ మార్కెట్ ను గత బీఆర్ఎస్ సర్కారు ఆ ప్రాంతంలో గవర్నమెట్ హాస్పిటల్ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. దీంతో ఫ్రూట్ మార్కెట్‌ను ఖాళీ చేయించి 2021లో కోహెడకు తరలించింది. 199.13 ఎకరాల్లో రూ.348 కోట్లతో నిర్మాణం చేపడతామని చెప్పి ఆసుపత్రి నిర్మాణాన్ని విస్మరించింది.
కోహెడలో తాత్కాలికంగా రూ.5 కోట్లు ఖర్చు చేసి షెడ్లను నిర్మించారు. నిర్మించిన మూన్నాళ్లకే వర్షాలు, గాలివానలకు ఆ షెడ్లు కూలిపోయాయి. దీంతో కోహెడ్ మార్కెట్ ను బాటసింగారం హెచ్ఎండీఏ లాజిస్టిక్ పార్కులోకి మార్చారు. గత నాలుగేళ్లుగా ఇక్కడే ఫ్రూట్‌మార్కెట్ కొనసాగుతోంది. హైదరాబాద్ శివారు కోహెడలో పండ్ల మార్కెట్‌ను జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
9 నెలల్లో కోహెడ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి, గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు, లాజిస్టిక్ పార్క్, ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్, సోలార్ సిస్టం, కోల్డ్ స్టోరేజ్, లేబర్, మార్కెట్ సిబ్బంది నివాస సముదాయాలు నిర్మిస్తామని నాటి పాలకులు చెప్పారు. మామిడి ఎగుమతుల కోసం వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ఇర్రాడియేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలా ప్రకటనలు చేసి ఫ్రూట్ మార్కెట్‌ను గడ్డి అన్నారం నుంచి తరలించిన నాటి బీఆర్ఎస్ సర్కారు.. మార్కెట్‌ను నిర్మించకుండా గాలికి వదిలేసింది.
రూ.35కోట్లు కిరాయికే!
కోహెడ మార్కెట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు వానలకు కూలిపోవడంతో గత 2021 నుంచి బాట సింగారంలో తాత్కాలికంగా ఫ్రూట్ మార్కెట్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇక్కడే గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ తాత్కాలిక షెడ్లలో కొనసాగుతోంది. ఈ లీజు స్థలంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి సదరు ప్రైవేటు సంస్థకు నెలకు రూ.70 లక్షల చొప్పున ఏడాదికి రూ.8.40 కోట్లు చెల్లిస్తున్నారు.
గత నాలుగేళ్లలో కిరాయి రూపంలో ఆ సంస్థకు దాదాపు రూ.35 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోహెడ మార్కెట్లో తాత్కాలిక షెడ్ల కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసి వృధా చేసిన మార్కెటింగ్ శాఖ.. మళ్లీ బాట సింగారంలో తాత్కాలికంగా నిర్వహించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించడం విమర్శలకు తావిస్తోంది.
కోహెడలో నిర్మాణం చేపట్టాలనే డిమాండ్
కోట్ల రూపాయలు వృధాగా ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అది కూడా గత ప్రభుత్వ హయంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి సన్నిహితునికి హెచ్ఎండీఏ స్థలాన్ని కట్టబెట్టడమే కాకుండా సదరు స్థలాన్ని ఫ్రూట్‌మార్కెట్ కోసం కోట్ల రూపాయలు కిరాయి రూపంలో చెల్లించడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొత్త సర్కారు కోహెడలో ఫ్రూట్‌మార్కెట్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఇక్కడ కోట్ల రూపాయలు కిరాయి చెల్లించే బదులు కోహెడలో కొత్త మార్కెట్ నిర్మించే వరకు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కోహెడ మార్కెట్ కోసం కొత్త సర్కారు ప్రతిపాదనలు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది.
