- మారనున్న దేవాలయ రూపురేఖలు
- రూ.75 కోట్ల పనులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం
- ఈ నెల 10 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు
- జాతర అనంతరం పట్టాలెక్కనున్న పనులు
హనుమకొండ/ భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి లైన్ క్లియర్ అయ్యింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ప్రసిద్ధమైన ఈ ఆలయాన్ని రూ.75 కోట్లతో డెవలప్ చేసేందుకు గతేడాది ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపించగా, ప్రభుత్వం ఆయా పనులకు ఆమోదం తెలిపింది.
ఈ నెల 10 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానుండగా, జాతర తర్వాత పనులు పట్టాలెక్కనున్నాయి. ఆలయ ఆవరణలో చేపట్టిన పనులు కొన్ని పెండింగ్ లో ఉండగా, సమగ్రాభివృద్ధికి ప్రతిపాదించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయితే కొత్తకొండ ఆలయ రూపురేఖలు మారనున్నాయి.
26 పనులు., రూ.75 కోట్లు..
కొత్తకొండ భద్రకాళి సమేతా వీరభద్రస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. పొలిటికల్ లీడర్లు కూడా సెంటిమెంట్ గా భావించి పూజలు చేస్తుంటారు. ఏటా సంక్రాంతి సమయంలో జరిగే జాతరకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. గతంలో ఆలయ అభివృద్ధిని పెద్దగా పట్టించుకోక ఇబ్బందులు ఎదురవగా, గతేడాది మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు అధికారులు టెంపుల్ డెవలప్మెంట్ కు ప్రణాళికలు రచించారు.
ఆలయ పునరుద్ధరణకు మొత్తం రూ.75 కోట్లతో 26 పనులు ప్రతిపాదించారు. ఆలయం, అధికారులు, సిబ్బంది, భక్తులు, రాకపోకలు సాగించే వాహనాలను దృష్టిలో పెట్టుకుని టెంపుల్ సమగ్రాభివృద్ధికి ప్రపోజల్స్ పంపగా, 10 రోజుల కింద ప్రభుత్వం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొద్దిరోజుల్లోనే కొత్తకొండ ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభంకానున్నాయి.
జాతర తరువాతే పనులు..
ఈ నెల 10వ తేదీ నుంచి కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 10న అంకురార్పణ, 11న త్రిశూలార్చన, నవకలశార్చన, 12న వాస్తుపూజ, హోమం, బలిహరణ, 13న మహాలింగార్చన, లక్షబిల్వార్చన నిర్వహించనున్నారు. 14న భోగి పండుగ సందర్భంగా అరుణయంత్రస్థాపన, చండీహోమం, 15న సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం, బండ్లు తిరిగే కార్యక్రమం, 16న కనుమ పండుగ సందర్భంగా నందీశ్వరాభిషేకం, పుష్పయాగం కొనసాగుతుంది.
17న మహా పూర్ణాహుతి, త్రిశూలస్నానం, 18న అగ్నిగుండాలు, స్వామివారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. దాదాపు 9 రోజుల పాటు ఉత్సవాలు జరగనుండగా, జాతర అనంతరం టెండర్లు చేపట్టి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తొందర్లోనే కొత్తకొండ ఆలయ అభివృద్ధి పనులు స్టార్ట్ కానుండగా, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేములవాడ తరహాలో..
కొత్తకొండ టెంపుల్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 26 పనులు ప్రతిపాదించగా, అందులో ఆలయ రాజగోపురాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతిస్వామి సూచన మేరకు ఆలయ తూర్పు వైపు వేములవాడ తరహాలో ఐదంతస్తుల రాజగోపురం, దక్షిణం, పడమర వైపు మూడు అంతస్తుల రాజగోపురాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం, లక్ష్మీగణపతి, ఆంజనేయస్వామి గుడికి సాలాహారం, ప్రసాదాల తయారీకి వంటశాల, ఆలయానికి ఉత్తరం వైపు కల్యాణ మండపం, 20 గదులతో షాపింగ్ కాంప్లెక్స్, ఈవో, చైర్మన్ గదుల నిర్మాణం, వీఐపీ సూట్ గదులు, సర్వే నెం.12లో 20 వసతి గదులు, ఆలయం చుట్టూ ప్రహరీ, ఓపెన్ డార్మెటరీ హాల్, క్యూ లైన్ల డెవలప్ మెంట్, ఐదు సులభ్ కాంప్లెక్సులు, ఎల్కతుర్తి జంక్షన్ వద్ద నంది శిలావిగ్రహం, గుడి చుట్టూ సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, టెంపుల్ వద్ద బస్టాండ్ నిర్మాణంతో పాటు మరికొన్ని పనులు చేపట్టనున్నారు.
