
- రూ.7 వేల కోట్లు వడ్డీలే కడుతున్నామని ప్రచారం చేస్తున్నారు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అప్పులకు ప్రతి నెలా రూ.7 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. ఆ వాదనలను కాగ్ రిపోర్ట్ కొట్టిపారేసిందన్నారు. గత నాలుగు నెలల్లో ప్రభుత్వం రూ.9,355 కోట్ల వడ్డీలే చెల్లించిందన్నారు. అంటే సగటున నెలకు రూ.2,340 కోట్లేనన్నారు. కానీ, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అప్పుల భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నదన్నారు.
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయిందని, ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ వారి కష్టాలను పట్టించుకోకుండా.. విలాసవంతమైన ప్రాజెక్టులపై సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. రూ.3.50 లక్షల కోట్లతో 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ.లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ, రూ. 225 కోట్లతో హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు.