
- రేవంత్ లాంటి సీఎంను ఇప్పటివరకు చూడలే: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన సీఎం రేవంత్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 50 వేల కోట్ల రూపాయల రుణమాఫీని 12 వేల కోట్లకు పరిమితం చేశారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు 100 సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సోమవారం మెదక్ జిల్లాకు చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని తాను ఇప్పటివరకు చూడలేదని, ఆయనకు కర్రుకాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఎవరైనా అట్లా చెప్పుకుంటారా..
‘ఢిల్లీకి పోతే దొంగల్లాగా చూస్తున్నారని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పుకుంటాడా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి చీదరించుకుంటున్నారన్నారు. ‘‘హరీశ్ రావు దగ్గర రేవంత్ రెడ్డి శిష్యరికం చేసిండు. హరీశ్ మంత్రయినప్పుడు ఇదే తెలంగాణ భవన్ ముందు రేవంత్ డాన్సులు చేశారు.
మేం అధికారంలో ఉన్న పదేండ్లు ప్రతిపక్షాల మీద అడ్డమైన కేసులు పెట్టలేదు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను పోలీసులతో కొట్టియ్యలేదు. నర్సింగ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసులు తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?’’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలన ప్రజలకు అర్థమైంది: హరీశ్ రావు
ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మెదక్ అంటే గాడిదలు ఎక్కువ ఉండేవి అనేవాళ్లని, ఇప్పుడు నాలుగు లైన్ల రోడ్లు, డివైడర్లతో అద్భుతంగా ఉన్నాయని హరీశ్ రావు అన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్టు కాంగ్రెస్ పాలన ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమైతున్నదన్నారు. రైతుబంధును కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య ఇస్తే, కాంగ్రెస్ ఓట్లకు ఓట్లకు మధ్య వేస్తున్నదని విమర్శించారు.
కాళేశ్వరం నీళ్లు మెదక్ కు కూడా వస్తాయని, మోటార్లు ఆన్ చేయాలని అడిగితే పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్పారన్నారు. ‘‘శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులు అయ్యింది అబద్దమా? మోటార్లు ఆన్ చేయనిది అబద్దమా? ఏపీలో పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి కృష్ణా నీళ్లు తీసుకుపోతుంటే నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకుండా మోసం చేయడం అబద్దమా?” అని ప్రశ్నించారు.