తిరుమల భక్తులకు అలెర్ట్​: నడక మార్గంలో చిరుత, ఎలుగుబంటి సంచారం...

తిరుమల భక్తులకు అలెర్ట్​: నడక మార్గంలో చిరుత, ఎలుగుబంటి సంచారం...

తిరుమల వెళ్లే భక్తుల్లో మళ్లీ భయం మొదలైంది.  మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించడంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన నెల రోజుల్లో రెండు రోజులపాటు వీటి సంచారం కనిపించింది. ఈ మేరకు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. డిసెంబర్ నెలలో 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కినట్లు టీటీడీ తెలిపింది. చిరుత, ఎలుగుబంటి సంచారంతో అప్రమత్తమైన టీటీడీ భక్తులను హెచ్చరించింది. నడకమార్గంలో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా రావాలని సూచించింది. ఈ విషయంపై టీటీడీ అధికారి మాట్లాడుతూ.. శేషాచల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో రెండు సార్లు చిరుత సంచారం కనిపించిందని, ఎలుగుబంటి సంచారం కూడా కనిపించిందని తెలిపారు. నడక మార్గానికి సమీపంలో ఎక్కడా జంతు సంచారం లేదని అన్నారు. అలిపిరి కాలిబాట మార్గంలోని 7వ మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నారని, కాలినడకన భక్తులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పనిలేదని, నిర్భయంగా తిరుమలకు రావొచ్చని పేర్కొన్నారు.

గత రెండు నెలల క్రితం తిరుమల నడక మార్గంలో పులుల సంచారం భక్తులను ఆందోళనకు గురిచేసింది. చిరుత పులి దాడిలో ఓ చిన్నారిసైతం మృతిచెందింది. ఈ ఘటనతో మెట్లమార్గంలో తిరుమల కొండపైకి చేరుకోవాలంటేనే భక్తులు భయంతో వణికిపోయారు. దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారుల బృందం బోనుల సహాయంతో చిరుతలను బంధించారు. ఆ తరువాత నడక మార్గంలో రక్షణ చర్యలు చేపట్టారు. భక్తులకు ఊత కర్రలుసైతం అందజేశారు. దీంతో మళ్లీ నెలరోజుల నుంచి భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా మెట్లమార్గంలో కొండపైకి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే, తాజాగా మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించడంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలను టీటీడీ గుర్తించడంతో భక్తుల్లో ఆందోళన మళ్లీ మొదలైంది.