- 26న కేబినెట్ ఆమోదించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ములుగులో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి లైన్ క్లియర్ అయింది. 221 ఎకరాల ల్యాండ్ కేటాయించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 26న జరగనున్న భేటీలో దీనికి కేబినెట్ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. ఈ ల్యాండ్ ను కేంద్ర గిరిజన శాఖకు అప్పగించనున్నారు. ఇటీవల ఈ అంశంపై రెవెన్యూ మంత్రి పోంగులేటితో ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సమావేశమై ల్యాండ్ కేటాయించాలని కోరారు.
యూనివర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు అవసరం అని కేంద్ర ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే ఇంత ల్యాండ్ ఒకే దగ్గర కేటాయించలేమని గత ప్రభుత్వం చెప్పటంతో యూనివర్సిటీ పనులు ఆగిపోయాయని పలు సార్లు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ర్ట నేతలు ప్రకటించారు. అయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర గిరిజన అధికారులతో మంత్రి సీతక్క చర్చించి రెండు చోట్ల ల్యాండ్ ఇస్తామని చెప్పటంతో అంగీకరించినట్లు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం తరువాత రెవెన్యూ శాఖ అధికారులు కేంద్ర ట్రైబల్ శాఖకు భూమిని అప్పగించనున్నారు.