
- భోపాల్ రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ అక్రమాస్తులు
భోపాల్: రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేయగా కుప్పలుతెప్పలుగా అక్రమాస్తులు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ జీపీ మెహతా ఇండ్లలో లోకాయుక్త అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. కొలోలకొద్దీ బంగారం, వెండితోపాటు ఆభరణాలు, నగదు గుర్తించారు. ఫామ్‌హౌస్‌లో 17 టన్నుల తేనె నిల్వలను
కనుగొన్నారు.
నగదు, నగలు స్వాధీనం
భోపాల్ నర్మదాపురంలోని నాలుగు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. మణిపురం కాలనీలో మెహతాకు చెందిన లగ్జరీ ఫ్లాట్‌లో 9 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఆభరణాలు, 56 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లను గుర్తించారు. డానాపానీ దగ్గర్లోని మెహతాకు చెందిన మరో ఇంట్లో సోదాలు చేయగా మూడు కోట్లకుపైగా విలువైన 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండితోపాటు ఇంకో 26 లక్షల క్యాష్ బయటపడింది.
ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆఫీసర్లకు 17 టన్నుల తేనె కనిపించింది. అనుమతి లేకుండా తేనె సాగు చేస్తూ నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆరు ట్రాక్టర్లు, చేపల పెంపకానికి ప్రైవేటు చెరువు, గోశాల, ఓ ఆలయం, నాలుగు ఖరీదైన కార్లు, నిర్మాణంలో ఉన్న 32 కాటేజీలు, ఇప్పటికే పూర్తయిన ఏడు కాటేజీలతో ఉన్న మెహతా సామ్రాజ్యాన్ని చూసి అధికారులు నివ్వెరపోయారు. మొహ్రా బినామీ సంస్థగా అనుమానిస్తున్న గోవింద్‌పురలోని ఓ ఇండస్ట్రీలో తనిఖీలు చేయగా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేస్కున్నారు. కౌంటింగ్ మెషీన్లు తెచ్చి లెక్కించగా పట్టుకున్న నగదు రూ. 36 లక్షలుగా తేలింది. డిజిటల్ ఫైళ్లు, బ్యాంకింగ్ రికార్డులను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ టీమ్స్‌ను నియమించారు.