V6 News

పునరావాస ప్రతిపాదనలను పరిశీలించండి

పునరావాస ప్రతిపాదనలను పరిశీలించండి
  • డిప్యూటీ సీఎం భట్టికి వినతిపత్రం సమర్పించిన మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితులు
  • మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం
  • కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఎఫెక్ట్​ అవుతున్న మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితులు సోమవారం ప్రజాభవన్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ పరిశీలన కోసం మూడు ప్రతిపాదనలను సమర్పించారు. మూసీ పునరుజ్జీవన పనులను తాము స్వాగతిస్తున్నామని, అభివృద్ధి పనులపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అందులో తమను కూడా భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. నిర్వాసితుల అందించిన మూడు ప్రతిపాదనలను మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. మధు పార్క్ రిడ్జ్ ఏ బ్లాక్ నిర్వాసితులు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో మధు పార్క్ రిడ్జ్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీశైలం, సెక్రటరీ డాక్టర్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.