కరీంనగర్ టౌన్, వెలుగు: ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా రూ.10వేల కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా అయ్యాయని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మంగళవారం కరీంనగర్ బస్టాండ్‌లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం జిల్లాలో విజయవంతంగా అమలవుతుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 6.91 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో కె.మహేశ్వర్, డీడబ్ల్యూవో సరస్వతి, మెప్మా పీడీ స్వరూపా రాణి, ఆర్టీసీ జోన్ ఈడీ పి.సోలోమన్, ఆర్ఎం రాజు, డిప్యూటీ ఆర్ఎం మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత బస్సుతో రూ.కోట్లు ఆదా
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు వేలాది కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా అయ్యాయని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం జగిత్యాల బస్టాండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం వల్ల మిగిలిన డబ్బును మహిళలు తమ కుటుంబ అవసరాలు, విద్య, ఆరోగ్యానికి ఖర్చు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ప్రయాణించే మహిళా ప్రయాణికులను కలెక్టర్ సన్మానించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, తదితరులు పాల్గొన్నారు.
