రాజ్యసభలో కేంద్ర మంత్రులకు, ఖర్గేకు మధ్య డైలాగ్ వార్

రాజ్యసభలో కేంద్ర మంత్రులకు, ఖర్గేకు మధ్య డైలాగ్ వార్

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బీజేపీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సోమవారం రాజస్థాన్​లోని అల్వార్​లో ఖర్గే మాట్లాడుతూ.. దేశం కోసం బీజేపీలో ఒక కుక్క కూడా ప్రాణత్యాగం చేయలేదంటూ విమర్శించారు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలంటూ మంగళవారం రాజ్యసభ సమావేశం మొదలైన వెంటనే బీజేపీ సభ్యులు నిరసనలకు దిగారు. ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులకు, ఖర్గేకు మధ్య డైలాగ్ వార్ నడిచింది. తాను పార్లమెంట్ బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదని ఖర్గే తేల్చిచెప్పారు. తన మాటల్లో తప్పేం లేదని, ఇప్పటికీ వాటికి కట్టుబడే ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్య్ం తెచ్చిందని, తమ పార్టీ నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో క్షమాపణలు చెప్పిన పార్టీ నేతలు.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్లను క్షమాపణలు చెప్పాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. చైనాతో బార్డర్ గొడవపై పార్లమెంట్ లో చర్చకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒప్పుకోవడంలేదని, కేంద్రం తీరు సింహంలా మాట్లాడుతూ.. ఎలుకలా ప్రవర్తించినట్లుగా ఉందన్నారు. లీడర్ ఆఫ్ ది హౌస్ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ వాళ్లు చరిత్రను గుర్తుపెట్టుకోలేదని అనుకుంటున్నా. కాంగ్రెస్ వల్లే జమ్మూకాశ్మీర్ సమస్య తలెత్తింది. పాక్ నుంచి ముప్పు, చైనా దురాక్రమణ, బీఆర్ అంబేద్కర్ కు, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు అవమానం కూడా కాంగ్రెస్ వల్లే జరిగిందన్న విషయం వాళ్లు మరిచిపోయారు” అని మండిపడ్డారు. మొత్తంగా అధికారపక్షం, ప్రతిపక్షాల వాదనలతో రాజ్యసభలో వాయిదాల పర్వం నడిచింది. 

మన భూమిని మోడీ వెనక్కితెస్తరు: ఎంపీ 

చైనా 1962 యుద్ధం సందర్భంగా ఆక్రమించిన మన భూభాగాన్ని ప్రధాని మోడీ తిరిగి రికవర్ చేస్తారని దేశ ప్రజలు నమ్ముతున్నారని నాందేడ్ బీజేపీ ఎంపీ ప్రతాప్ రావ్ పాటిల్ అన్నారు. మంగళవారం లోక్ సభలో జీరో హవర్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇండియా భూభాగాన్ని వెనక్కి తీసుకోవాలని 1962, నవంబర్ 14న పార్లమెంట్ లో తీర్మానం పాస్ చేశారని, కానీ 60 ఏండ్లు గడిచినా దానిని సాధించలేకపోయారని అన్నారు. ‘‘బీజేపీ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ లో టెర్రరిస్టులను చంపింది. చైనాకు గల్వాన్ లోయలో, తవాంగ్ సెక్టార్ లో దీటైన జవాబు చెప్పింది. 1962లో కోల్పోయిన భూమిని కూడా కేంద్రం తిరిగి తెస్తుందని ఇప్పుడు దేశ ప్రజలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పార్లమెంట్ తీర్మానాన్ని అమలు చేయాలని ప్రధానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా” అని తెలిపారు.

ముందే ముగియనున్న సమావేశాలు? 

పార్లమెంటు వింటర్ సెషన్ సమావేశాలు షెడ్యూల్‌‌ కంటే ముందే ముగిసే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్‌‌ ప్రకారం ఈ నెల 7న ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 29 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే డిసెంబర్ 23న పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడనున్నట్లు సమాచారం. అంటే షెడ్యూల్ కంటే ఆరు రోజులు ముందుగానే సమావేశాలు ముగిసే చాన్స్ ఉంది. లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బిజినెస్‌‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రిస్ మస్, న్యూఇయర్ వేడుకలు ఉన్నందున ముందుగానే సమావేశాలను ముగించాలని పలువురు ప్రతిపక్ష నేతలు చేసిన విజ్ఞప్తి మేరకు సమావేశాలను ముగించాలని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

135 కోట్ల జనం నవ్వుకుంటున్రు: జగ్​దీప్​ ధన్​కర్ 

రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల సభ్యుల వాగ్వాదంతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్​దీప్ ధన్‭ కర్ అసహనం వ్యక్తంచేశారు. సభలో ఇలా ప్రవర్తించడం వల్ల చెడ్డ పేరు వస్తుందన్నారు. సభ నడిచే తీరుపై ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారని చెప్పారు. ‘‘మీరు చేస్తున్నది చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుకుంటు న్నారు. మనమేం చిన్నపిల్లలం కాదు” అని అధికార, ప్రతిపక్ష సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్ వెలుపల జరిగిన దానిపై  సభలో ఆందోళనలు సరికాదన్నారు. ఖర్గే కామెంట్లపై అటు లోక్ సభలోనూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.