బీఆర్ఎస్.. కాలిపోతున్న ఇల్లు: మల్లు రవి

బీఆర్ఎస్.. కాలిపోతున్న ఇల్లు: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ మంటల్లో కాలిపోతున్న ఇల్లు లాంటిదని.. అందుకే ఆ పార్టీలోని నేతలు తమను తాము కాపాడుకోవడానికి ఇతర పార్టీల్లోకి జాయిన్ అవుతున్నారని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ లీడర్లంతా కేసీఆర్ బాధితులే అని తెలిపారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజాపాలన పునరుద్ధరించాం. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న ఎన్నికల హామీని రేవంత్ సర్కార్ నిలబెట్టుకున్నది. ప్రజలకు అనుకూలంగా హామీలు అమలు చేశాం. 

బీఆర్​ఎస్ మాత్రం శిశుపాలుడిలా వంద తప్పులు చేయడంతో తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఓడించి బుద్ధి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది. అందుకే ప్లాన్ ప్రకారమే కవిత అరెస్ట్ అయింది’’అని ఆరోపించారు. తాము గెలవకపోయినా పర్లేదు కానీ.. కాంగ్రెస్ విజయం సాధించొద్దన్న ధోరణిలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయని విమర్శించారు. కవిత అరెస్ట్ రాజకీయ డ్రామా అని మండిపడ్డారు. ఒక దళితుడు ప్రతిపక్ష హోదాలో ఉండొద్దనే ఆ నాడు మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలోని సీఎల్పీ లేకుండా కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడ్తామంటూ బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకే రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు గేట్లు తెరిచారని చెప్పారు.