మీ అభిమానం సల్లంగుండ.. ‘వారణాసి’ హీరో మహేష్ బాబు కారు చలాన్లు కట్టిన అభిమాని !

మీ అభిమానం సల్లంగుండ.. ‘వారణాసి’ హీరో మహేష్ బాబు కారు చలాన్లు కట్టిన అభిమాని !

‘వారణాసి’ హీరో మహేష్ బాబుపై ఆయన అభిమానులు పెంచుకున్న ప్రేమ వెల కట్టలేనిది. అభిమానం ఎంతలా పెంచుకున్నారంటే.. ‘అతడు’ ఏ ఒక్క విషయంలో మాట పడే పరిస్థితి రాకూడదని ఆయన అభిమానులు భావిస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోనే అందుకు నిదర్శనం. ఆ వీడియోలో ఏముందంటే.. MaheshBabu కారు PVNR ఎక్స్‌ప్రెస్‌ వేపై స్పీడ్ లిమిట్ దాటడంతో.. అతని కారుపై రెండు చలాన్లు పడ్డాయి. ఈ విషయంపై.. సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంతో తట్టుకోలేకపోయిన మహేష్ బాబు వీరాభిమాని ఒకరు.. వెంటనే పెండింగ్లో ఉన్న ఆ 2 వేల 70 రూపాయల చలాను మొత్తాన్ని స్వయంగా చెల్లించి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అభిమాన హీరోపై ఒక చిన్న మరక కూడా పడకూడదని ఈ మహేష్ అభిమాని భావించడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకునే మహేష్ బాబు లాంటి హీరోకు కారు చలాన్లు చెల్లించడం పెద్ద పనేం కాదని.. సదరు అభిమాని చెల్లించాల్సినంత అవసరం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అభిమానం ఉండొచ్చు గానీ హీరోలను ఉద్ధరించేంత అక్కర్లేదని.. ఆ హీరో సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేంత వరకూ ఉంటే చాలని కొందరు నెటిజన్లు హితవు పలికారు. ఏదేమైనా.. మహేష్ బాబు కారు చలాన్లను ఒక అభిమానం చెల్లించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

మహేష్‌ బాబు హీరోగా.. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ వరల్డ్ భారీ అడ్వెంచరస్‌ మూవీ  టైటిల్‌ను శనివారం అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో ఆర్‌‌ఎఫ్‌సీలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించిన రాజమౌళి టీమ్.. ఈ వేదికపై ‘వారణాసి’ అనే టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్,  ‘వారణాసి టు ది వరల్డ్‌’ పేరుతో వీడియోను విడుదల చేశారు. యుగాలు, ఖండాలతో కూడిన అద్భుతమైన విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సాగిన ఈ వీడియో చివర్లో.. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో చేతిలో త్రిశూలం పట్టుకుని ఎద్దుపై వస్తున్న మహేష్ బాబు లుక్‌ ఇంప్రెస్‌ చేసింది. అలాగే వేదికపై కూడా ఎద్దు బొమ్మపై కూర్చుని మహేష్‌ బాబు ఎంట్రీ ఇవ్వడం ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది.