కటింగ్ లేకుండా వడ్లు కొనాలని రైతుల ధర్నా.. కరీంనగర్ నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

కటింగ్ లేకుండా వడ్లు కొనాలని రైతుల ధర్నా.. కరీంనగర్  నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

కొడిమ్యాల, వెలుగు: కటింగ్ లేకుండా వడ్లు కొనాలని కరీంనగర్ జిల్లాలో ధర్నాకు దిగారు రైతులు. క్వింటాలు వడ్లకు 10 కిలోల మేర వడ్లు కటింగ్ పెడుతున్నారని కొడిమ్యాల మండల రైతులు ఆదివారం  (నవంబర్ 16)   జగిత్యాల - కరీంనగర్ నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. సుమారు గంటపాటు రైతులు ధర్నా చేయడంతో కిలోమీటర్ల మీర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రైతులు ధర్నా విరమణ చేయకపోవడంతో తహసీల్దార్ కిరణ్ రైతులతో మాట్లాడారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తాకు 600 గ్రాములు మాత్రమే కటింగ్ పెడతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. 

అంతకు ముందు రైతులు మాట్లాడుతూ మిల్లర్లు ఎలా చెప్తే సెంటర్ నిర్వాహకులు అలా కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి క్వింటాకు 10 కిలోల మేర కటింగ్ పెడుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని.. తక్షణమే కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు ఉండేలా చూడాలని.. అకాల వర్షాలతో తీవ్ర అవస్థలు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.