చలికాలం వచ్చేసిందిగా.. గీజర్ వాడుతున్నారా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేకపోతే అది పేలిపోవచ్చు !

చలికాలం వచ్చేసిందిగా.. గీజర్ వాడుతున్నారా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేకపోతే అది పేలిపోవచ్చు !

చలికాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో.. ఎప్పటిలా చల్లటి నీటితో స్నానం చేయడం కష్టమే. అందువల్ల.. ఊళ్లలో కట్టెలపొయ్యితో నీళ్లు కాగబెట్టుకుని స్నానం చేస్తున్నారు. పట్టణాల్లో, నగరాల్లో హీటర్లు, గీజర్లు వాడుతున్నారు. చలికాలం వచ్చిందంటే.. గీజర్‌ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన పరికరంగా మారిపోతుంది. ఈ గీజర్‌లు నీటిని త్వరగా వేడి చేస్తాయి.

ఆటో కట్ఆఫ్, టెంపరేచర్ కంట్రోలర్.. ఇలా ఎన్నో కొత్త ఫీచర్స్తో గీజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే.. గీజర్లు ఎంత ఉపయోగపడతాయో జాగ్రత్తగా వాడుకోకపోతే అంతే డేంజర్. గీజర్‌ను ఆన్ చేసే ముందు.. కొన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిని సరిగ్గా సర్వీస్ చేయడం ముఖ్యం. చిన్న నిర్లక్ష్యం కూడా తీవ్ర ప్రమాదానికి దారితీయొచ్చు.

గీజర్ చాలా రోజుల తర్వాత ఆన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ కాలం ఉపయోగించకుండా వదిలేస్తే, గీజర్ లోపల ఉన్న హీటింగ్ ఎలిమెంట్‌పై తుప్పు పేరుకుపోతుంది. ఇది నీటిని వేడి చేయడానికి పట్టే సమయాన్ని పెంచుతుంది. దీని వల్ల కరెంట్ బిల్లు పెరుగుతుంది. అందుకే.. టెక్నీషియన్తో క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటే బెటర్. నీళ్లను నింపకుండా గీజర్‌ను ఆన్ చేయొద్దు. అలా చేయడం వల్ల హీటింగ్ ఎలిమెంట్ వేడెక్కుతుంది.

నీళ్లు లేకుండా ఆన్ చేస్తే ఎల్మెంట్ త్వరగా వేడెక్కి గీజర్ కాలిపోతుంది. కొన్ని సార్లు గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది. గీజర్ అనేది అధిక విద్యుత్ వినియోగ పరికరం. కనెక్ట్ చేసే వైర్లు లేదా సాకెట్లు పాతవి లేదా దెబ్బతిన్నట్లయితే, షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ షాక్ ప్రమాదం ఉంది. అందువల్ల, సరైన ఎర్తింగ్, సురక్షితమైన వైరింగ్‌ను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల, వైరింగ్ మరియు సాకెట్లను ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ ద్వారా క్రమం తప్పకుండా చెక్ చేయించుకోండి.

గ్యాస్ గీజర్లకు వెంటిలేషన్ చాలా ముఖ్యం, ఎందుకంటే అవి కార్బన్ మోనాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. బాత్రూంలో ఎలక్ట్రిక్ గీజర్‌లు లేదా ఏదైనా గీజర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, స్నానం చేసేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆన్‌లో ఉంచండి. స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచొద్దు. నీరు వేడిగా మారిన తర్వాత, పవర్ పాయింట్ దగ్గర దాన్ని ఆపివేయండి. తర్వాత స్నానం చేయండి. గీజర్ ఏ భాగం నుంచి అయినా నీటి లీకేజీలను జాగ్రత్తగా చెక్ చేయండి. చిన్న లీకేజీ కూడా విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన ప్రమాదాల తీవ్రతను పెంచుతుంది.