కార్తీకమాసం చివరికి వచ్చింది. ఈ ఏడాది ( 2025) నవంబర్ 17 కార్తీకమాసం చివరి సోమవారం. ఈ 30 రోజులకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నా.. కార్తీక సోమవారం చివరి సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దరిద్రాలన్నీ తొలగిపోవడం ఖాయమని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం కార్తీక మాసంలో దేవతలంతా కలిసి దివికి దిగి వచ్చి దేవతల దీపావళి జరుపుకుంటారని నమ్మిక. ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం పొంది సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది (2025) కార్తీక మాసం చివరి సోమవారం నవంబరు 17 అవుతుంది. కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక ఈ రోజుకు ప్రత్యేకత ఎక్కువ.ఈ రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల భక్తులకు సిరి సంపదలు, విద్య, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని నమ్ముతారు.
కార్తీక మాసం చివరి సోమవారం చేయాల్సిన పరిహారాలు.
- కార్తీకమాసం అంతా గుడికి వెళ్లకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్లాలి.
- ఉదయాన్నే ఇంటినీ, ఒంటినీ శుభ్రం చేసుకుని శివుడి దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి.
- శివక్షేత్రానికి వెళ్లి ఆయనకు ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి.
- నీటితో లేదా పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి.
- గంగాజలం, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి.
- కార్తీకమాసం చివరిసోమవారం రోజున మీ స్తోమతను బట్టి అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి.
- ప్రతి రోజూ దీపారాధన చేసే అలవాటు, వీలు లేని వారు కార్తీకమాసంలో పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించని వారు ...చివరి సోమవారం రోజున 365 వత్తులు, లక్ష వత్తులతో దీపాలు వెలిగించాలి.
- కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకు ఆహారం తినిపించాలి.
- ఆలయంలో ఉండే ద్వజ స్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి.
- కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక నవంబర్ 17న ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణ చేయాలి.
