- మెదక్ జిల్లా చల్మెడలో 20 మందికి పైగా బాధితులు
- ఈజీ మనీపై ఆశతో అప్పులపాలైన యువకులు
- నూటికి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు
- అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు
మెదక్ / నిజాంపేట, వెలుగు:స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ పేకాట, బెట్టింగ్‌ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు బానిసలుగా మారుతున్నారు. ఇందుకోసం అందినకాడల్లా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్‌లలో పెడ్తున్నారు.
మెదక్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు. నిజాంపేట మండలంలోని ఒక్క చల్మెడ గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్‌లైన్ పేకాట, బెట్టింగ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పైసలు పెట్టి భారీగా నష్టపోయారు.
మొదట్లో వందలు పెడ్తే వేలు రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు.. చివరకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో పెట్టిన డబ్బులన్నీ కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో అప్పు చేసి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
చల్మెడ గ్రామానికి చెందిన ఒక్కో యువకుడు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులపాలయ్యారు. అప్పులవాళ్ల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్న ఎకరా, అర ఎకరం పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారు.
కుటుంబాల్లో గొడవలు
ఆన్‌లైన్ గేమ్స్‌తో యువకులు ఆర్థికంగా నష్టపోతుండడంతో పాటు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. అప్పులు తీర్చేందుకు కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తుండటం, భూములు అమ్మే పరిస్థితి
తలెత్తుతుండటంతో పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్లాయి.
‘ఆ పిలగాడు ఫోన్‌లో గేమ్ ఆడి మస్త్ పైసలు పోగొట్టిండట.. మస్తు అప్పు అయ్యింది. కొంత భూమి అమ్మేసిండు, అయినా ఇంకా అప్పు ఉందట, ఇంకింత భూమి అమ్మితే గాని అప్పు తీరేట్టు లేదు’ అనే మాటలు చల్మెడ గ్రామంలో వినిపిస్తున్నాయి.
రూ.10 మిత్తీకి తెస్తున్నరు
ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన యువకులు కొందరు ప్రైవేట్ ఫైనాన్స్‌లో అప్పులు తీసుకుంటున్నారు. దీనిని అదనుగా తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులు వందకు రూ.5 నుంచి రూ.10 వరకు మిత్తీ వసూలు చేస్తున్నారు. దీంతో అసలుతో పాటు మిత్తీ భారీగా పెరిగిపోతున్నది.
మండల కేంద్రమైన నిజాంపేటలో కొంతమంది ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫైనాన్స్‌లు నడిపే వ్యక్తులు అధిక వడ్దీకి అప్పులు ఇస్తుండడంతో పాటు, ష్యూరిటీగా భూములను ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత గడువులోగా అప్పు, మిత్తీ డబ్బులు చెల్లించకుంటే ఆ భూములు తమపరం చేసుకుంటున్నట్టు తెలిసింది.
అవగాహనతో అడ్డుకట్ట
గ్రామంలో అనేక మంది యువకులు ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నది. యువత ఆన్‌లైన్ గేమ్స్జోలికి వెళ్లకుండా పోలీసులు గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అధిక వడ్డీకి అప్పులిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన ఓ 26 ఏండ్ల యువకుడు గతంలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. తన ఫ్రెండ్‌ను చూసి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో తెలిసివారి దగ్గర 5 నుంచి 10 రూపాయల మిత్తీకి రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో చేసేదేమీ లేక తమకున్న ఎకరం భూమిలో అర ఎకరం అమ్మి అప్పులు తీర్చేశారు.
ఇదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే 38 ఏండ్ల వ్యక్తి.. ఆన్‌లైన్ గేమ్స్‌కు అటవాటుపడ్డాడు. చివరకు గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా బానిసయ్యాడు. గేమ్స్‌లో పెట్టేందుకు తెలిసిన చోటల్లా అధికవడ్డీకి అప్పులు చేశాడు. ఏడాదిన్నర కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి సుమారు రూ.కోటి వరకు అప్పులయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తుండడంతో రెండున్నర ఎకరాల భూమిని అమ్మి కట్టేశాడు.
బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు
యువత బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దు. అప్పుల ఊబిలో చిక్కుకోవద్దు. గ్రామాల్లో ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్‌లపై అవగాహన కల్పిస్తాం. అలాగే, భూములు కుదవబెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులిస్తున్నవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం.
- రాజేశ్, నిజాంపేట ఎస్సై
