బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 వేదికపై ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా యువ సామ్రాట్ నాగ చైతన్య అడుగు పెట్టారు. తన కొడుకును హౌస్‌లోకి ఆహ్వానించిన హోస్ట్ నాగార్జున.. చైతూని చూడగానే సరదాగా 'రేయ్ ఏంట్రా ఇక్కడ?' అంటూ పలకరించారు. తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణ ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. చైతూ , రీతూ మధ్య జరిగినఆసక్తికరమైన సంభాషణ అందరిని ఆకట్టుకుంది.
రేసింగ్ లీగ్ ఓనర్‌గా చైతూ సర్ప్రైజ్!..
చైతూ తన రాకకు గల కారణాన్ని వివరిస్తూ.. "నాకు యాక్టింగ్‌తో పాటు రేసింగ్ అంటే పిచ్చి అని మీకు తెలుసు కదా" అని నాగార్జునను అడిగారు. వెంటనే ఆయన, ఎందుకు తెలీదు, బాగా తెలుసు అని నవ్వుతూ చెప్పారు. చైతూ అసలు సర్ప్రైజ్ అప్పుడే ఇచ్చాడు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అనే ఫెస్టివల్ స్టార్ట్ చేశారు. అందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టుకు నేను ఓనర్ అని ప్రకటించడంతో నాగార్జున ఆశ్చర్యపోయారు. 'సూపర్! ఇది నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావ్?' అని అడిగితే.. 'చేశానులే' అంటూ చైతూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. రేసింగ్ పట్ల తనకున్న మక్కువను తెలియజేస్తూ, దీని గురించి హౌస్‌మేట్స్‌తో పంచుకోవడానికి వచ్చినట్లు చైతూ తెలిపారు.
చైతూ కాళ్లంటే పిచ్చి..
నాగ చైతన్యను చూడగానే హౌస్‌మేట్స్ అంతా ఉత్సాహంగా పలకరించారు. ముఖ్యంగా, కంటెస్టెంట్ రీతూ చైతూతో ప్రత్యేకంగా ముచ్చటించారు. 'హాయ్ చై గారు' అని రీతూ పలకరిస్తే, చైతూ 'హాయ్ రీతూ గారు' అని రిప్లై ఇచ్చారు. 'మీరంటే నాకు చాలా పిచ్చి' అని రీతూ అనగానే.. 'మొన్నటిదాకా నేనని చెప్పావ్' అంటూ నాగార్జున సరదా కౌంటర్ వేశారు. దీనికి రీతూ 'సార్, మీరు మీరే సార్' అని కవర్ చేసుకుంది. దీంతో అందరూ ఒక్కసారి నవ్వుకున్నారు.
ఇక, చైతూలో రీతూకి బాగా నచ్చిన విషయం గురించి నాగార్జున అడగగా.. రీతూ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. "కాళ్లుంటాయి సార్... చైతూ గారి కాళ్లు ఎంత తెల్లగా ఉంటాయో సార్! ఏదో శిల్పం చెక్కినట్లు ఉంటాయి" అని రీతూ చెప్పగానే.. చై సిగ్గుతో నవ్వుకుంటూ తల దించుకున్నారు. వెంటనే నాగార్జున మళ్లీ కౌంటర్ వేశారు. "హలో రీతూ, ఆ శిల్పం చెక్కింది నేనూ... కూర్చో" అంటూ నవ్వులు పూయించారు.
'ఏమాయ చేశావే' జ్ఞాపకాలు
రీతూ తన ఫేవరెట్ సినిమా గురించి మాట్లాడుతూ.. "ఏమాయ చేశావే" సినిమాలోని హీరో పేరు (కార్తీక్) తనకు ఎంతగా నచ్చిందో చెప్పింది. "నేను నా బాయ్‌ఫ్రెండ్ పేరు కార్తీక్ ఉండాలని కొద్ది రోజులు వెతికాను" అని చెప్పడంతో.. చైతూ "మరి నీ పేరు జెస్సీ కాదు కదా?" అంటూ ఆ సినిమాలోని హీరోయిన్ సమంత పాత్రను గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు.
రీతూకి చైతూతో బైక్ రైడ్ ఆఫర్..
చివరిలో, రీతూకి నాగార్జున ఒక ఆఫర్ ఇచ్చారు. చై కి బైక్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు హౌస్‌లో నుంచి ఇప్పుడు వచ్చేస్తే, చై నిన్ను బైక్ రైడ్‌కి తీసుకెళ్తాడు. ఈ మాట వినగానే రీతూ ఉత్సాహంగా "యస్ సార్, నేను వచ్చేస్తా" అంటూ గెంతులేసింది. అప్పుడు చైతూ కలుగజేసుకుని.. గెలిచినా కూడా తర్వాత నిన్ను రైడ్‌కి తీసుకెళ్లొచ్చు కదా నేను... దాని కోసం ఎందుకు వచ్చేయడం? అని అడిగాడు. అయితే రీతూ, నేను మిమ్మల్ని జోష్ నుంచి గెలుచుకుందామనుకుంటున్నాను అని అనగానే నాగ్, చైతూ నవ్వుకున్నారు. మొత్తానికి చైతూ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త ఉత్సాహం నిండింది. ఎలిమినేషన్ రోజు వస్తున్న ఈ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
