
పాపన్నపేట, వెలుగు : షాపుల వద్ద జరిగిన గొడవ ఓ యువకుడి మరణానికి దారి తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... నాగ్సాన్‌పల్లికి చెందిన శేరి మహబూబ్ (35) టైర్ పంక్చర్ దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. అతడి సోదరి సుల్తానా ఏడుపాయల వద్ద చికెన్‌షాప్ నిర్వహిస్తోంది. ఆమె దుకాణం పక్కనే నాగ్సాన్‌పల్లికి చెందిన చాకలి విఠల్ సైతం చికెన్ షాపు నడుపుతున్నాడు. గిరాకీ విషయంలో సుల్తానా, విఠల్ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
ఆదివారం రాత్రి విఠల్ తన భార్య రాజమణి, కొడుకులు యాదగిరి, మహేశ్‌తో కలిసి సుల్తానా షాప్ వద్దకు వచ్చి ఆమెతో గొడవ పడ్డారు. దీంతో అక్కడే ఉన్న మహబూబ్ భార్య రేష్మ ఫోన్‌లో తన భర్తకు విషయం చెప్పడంతో అతడు షాప్ వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో విఠల్, రాజమణి, యాదగిరి, మహేశ్ కలిసి మహబూబ్‌పై దాడి చేశారు.
గొడవను అడ్డుకోబోయిన వారిని సైతం కొట్టారు. అనంతరం తీవ్రంగా గాయపడ్డ మహబూబ్‌ను కుటుంబ సభ్యులు చికిత్స కోసం మెదక్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా... పరీక్షించి డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మహబూబ్ భార్య రేష్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.