మెదక్ జిల్లాలో విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్

మెదక్ జిల్లాలో  విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్

మెదక్, వెలుగు : భారీ వర్షాలు, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలి, సహాయక చర్యలు ఎలా నిర్వహించాలనే అంశాలపై సోమవారం మెదక్ జిల్లాలో రెండు లొకేషన్స్​లో మాక్​ డ్రిల్​నిర్వహించారు. 

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హవేలి ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా, బూరుగుపల్లిలో కలెక్టర్​రాహుల్​రాజ్, డ్రిల్ జనరల్ అబ్జర్వర్, కరీంనగర్ డీఎఫ్​వో శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేశ్, అడిషనల్​ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వేణు మాక్ డ్రిల్ ను పర్యవేక్షించారు. భారీ వర్షాల వల్ల వరదలు సంభవించినప్పుడు నీటి ప్రవాహంలో చిక్కుకున్న పశువులు, కొట్టుకుపోతున్న వ్యక్తులను ఎలా రక్షించాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వివిధ శాఖల అధికారులు, ఆపద మిత్ర వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడేట్ లు సహాయక చర్యలను మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమన్నారు. మాక్ డ్రిల్‌ నిర్వహణ ద్వారా అధికారులు, సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉంటుందన్నారు. విపత్తులు సంభవించిన సందర్భాల్లో ప్రాణ, ఆస్తినష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.