- మేడిగడ్డపై దుష్ప్రచారం తప్ప రెండేళ్లుగా రిపేర్లు చేయట్లే
- మాజీ మంత్రి ఎర్రబెల్లి
- మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ లీడర్లు
మహదేవపూర్, వెలుగు: జగిత్యాలలో కేసీఆర్ సభ పెడుతున్నాడని భయపడే రేవంత్ రెడ్డి మేడిగడ్డలో సభ పెడుతున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యారేజీ కుంగిన తర్వాత మూడేండ్లుగా రిపేర్లు చేయకుండా తాత్సారం చేస్తూ రాజకీయానికి వాడుకుంటున్నారని ఆరోపించారు.
‘కేసీఆర్ గతంలో నల్గొండలో మీటింగ్ పెడితే మేడిగడ్డ బ్యారేజీకి సీఎం వచ్చి మాట్లాడిండు. ఇప్పుడు జగిత్యాలలో మీటింగ్ పెట్టబోతుంటే మళ్లీ మేడిగడ్డ బ్యారేజీకి వచ్చి మీటింగ్ పెట్టబోతున్నాడు.’ దీనిని ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలకే వదిలేస్తున్న.. అన్నారు. రేవంత్ రెడ్డి ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్లు కుంగినాయని, ఇంత పెద్ద బ్యారేజీ కడితే ప్రమాదం జరగదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు రాకుండా మహారాష్ట్రలో బ్యారేజీలు కడితే రేవంత్ రెడ్డి తాను కలిసి పోరాటాలు చేశామని, జైలుకు వెళ్లామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఖరాబైన ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని.. కానీ, మేడిగడ్డ బ్యారేజీని మాత్రం బూచిగా చూపెడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సమయం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లీడర్ల ఇసుక దందా కోసం మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ ను ఆపుతున్నారని మండిపడ్డారు. మూసీ నది అంటూ మరోసారి హైడ్రా అంటూ ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ అంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, దాసరి మనోహర్ రెడ్డి, వినయ్ భాస్కర్, మాజీ జడ్పీ చైర్ పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి పాల్గొన్నారు.

