- 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన 'మెలోడీ' చాక్లెట్ ముచ్చట.. స్టాక్ మార్కెట్లో ఒక చిన్న కంపెనీ షేర్లను పరుగులు పెట్టించింది. ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే స్మాల్ క్యాప్ కంపెనీ పార్లే ఇండస్ట్రీస్ షేరు బుధవారం ఏకంగా 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకింది. రూ.5.25 వద్ద ముగిసింది.
ప్రధాని మోదీ, మెలోనికి 'మెలోడీ' చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్యాకెట్‌పైన పార్లే లోగో హైలెట్ కావడంతో ఇన్వెస్టర్లు పొరపడి 'పార్లే ఇండస్ట్రీస్' షేర్లను భారీగా కొనుగోలు చేశారు. అయితే, ఈ మెలోడీ బ్రాండ్ అసలు యజమాని ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్. పార్లే జీ, హైడ్ అండ్ సీక్, మొనాకో వంటి పాపులర్ బ్రాండ్లను నిర్వహిస్తున్న ఈ కంపెనీ, ఇంకా మార్కెట్లో లిస్ట్ కాలేదు.
ప్రైవేట్ కంపెనీగా కొనసాగుతోంది. కానీ పేరులో ఉన్న పోలిక వల్ల ఇన్వెస్టర్లు లిస్టెడ్ కంపెనీ అయిన పార్లే ఇండస్ట్రీస్ షేర్లను కొనేశారు. ఈ వైరల్ న్యూస్ కారణంగా ఈ షేరు ట్రేడింగ్ వాల్యూమ్ బుధవారం 8 లక్షలు దాటింది.
