బ్రూక్లిన్ బ్రిడ్జిని ఢీకొట్టిన మెక్సికన్ షిప్

బ్రూక్లిన్ బ్రిడ్జిని ఢీకొట్టిన మెక్సికన్ షిప్
  • ఇద్దరు మృతి, మరో 19 మందికి గాయాలు

న్యూయార్క్: అమెరికాలోని ప్రఖ్యాత బ్రూక్లిన్ బ్రిడ్జిని మెక్సికాకు చెందిన నౌక ఢీ కొట్టింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నౌకలోని ఇద్దరు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలై చనిపోయారు. మరో పందొమ్మిది మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. అయితే, బ్రిడ్జికి పెద్దగా డ్యామేజీ జరగలేదని న్యూయార్క్ సిటీ మేయర్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమేంటనే విషయంపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. షిప్ పై కెప్టెన్ నియంత్రణ కోల్పోవడం వల్లే నౌక బ్రిడ్జిని ఢీ కొట్టిందని ప్రాథమికంగా తేలిందని చెప్పారు.

ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు ఆయన వివరించారు. బ్రిడ్జిని ఢీ కొట్టడం వల్ల నౌకలోని మూడు స్తంభాలు మధ్యలోకి విరిగిపోయాయని, కొంతమంది సిబ్బంది ఆ స్తంభాలకు వేలాడడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంపై మెక్సికన్ నేవీ స్పందిస్తూ.. ప్రమాదానికి గురైన నౌక క్యాడెట్ల శిక్షణకు ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. శిక్షణలో భాగంగా270 మండి క్యాడెట్లతో 15 దేశాల్లోని 22 పోర్టుల సందర్శనకు నౌక బయలుదేరిందని పేర్కొంది.