- భయాలు, అణచివేత గత పాలకులది.. మాది ప్రజా ప్రభుత్వం
- ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు
- ఎస్‌టీయూటీఎస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత పదేండ్ల పాలనలో పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిస్తూ వస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గత పాలకుల హయాంలో ఉన్న రూ.25 వేల కోట్ల ఉద్యోగుల బకాయిలను ప్రస్తుతం రూ.11 వేల కోట్లకు తగ్గించామని ఆయన వెల్లడించారు.
ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్‌టీయూటీఎస్) 80 ఏండ్ల వసంతాల వైభవోత్సవాలు నిర్వహించారు. ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు.
భయం, అణచివేత ధోరణి గత పాలకులదని, తమది సాటి మనుషులను గౌరవించే ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా ఆగిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులు తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, మెగా డీఎస్సీని నిర్వహించామని గుర్తుచేశారు. హెల్త్ కార్డ్ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసిందని, డీఏ, పీఆర్సీ సమస్యల పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
ఎప్పుడూ ప్రజా ఉద్యమాల ఒడిలోనే: కూనంనేని
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని టీచర్ల సంఘాలకు మాతృత్వం ప్రసాదించిన సంఘం ఎస్టీయూ అని తెలిపారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరడం కొందరికి అలవాటైనా, ఎస్టీయూ మాత్రం ఏనాడూ అధికార పీఠాల ఒడిలోకి చేరలేదని, కేవలం ప్రజా ఉద్యమాల ఒడిలోనే నిలిచిందని స్పష్టం చేశారు.
టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. గత పదేండ్ల కాలంలో చిన్న ధర్నా కూడా చేసుకోలేని పరిస్థితి నుంచి సీఎంతో చర్చలు జరిపి రూ.10 వేల కోట్ల ప్రయోజనాలు సాధించుకున్నామని తెలిపారు. మార్చి నాటికి మిగిలిన రూ.11 వేల కోట్ల పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలన్నారు. సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, జుట్టు గజేందర్ మాట్లాడుతూ.. హక్కులు సాధించే వరకు ఎస్టీయూ విశ్రమించబోదని, నాటి నాయకుల స్ఫూర్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ కె. లింగయ్య, ఎస్‌టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సాబేర్ ఆలీ, మాజీ ఎమ్మెల్సీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
