స్టాక్ మార్కెట్ వెయ్యి పాయింట్లు డౌన్ : భారీ నష్టాలకు కారణాలు ఇవే..!

స్టాక్ మార్కెట్ వెయ్యి పాయింట్లు డౌన్ : భారీ నష్టాలకు కారణాలు ఇవే..!

గతవారం ఊహించని రీతిలో ఒడిదొడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్లు కొత్త వారం కూడా అదే అస్థిరతను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా సోమవారం ఉదయం 10.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 870 పాయింట్ల నష్టంతో ఉండగా, నిఫ్టీ సూచీ 272 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 921 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 632 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ సూచీ అత్యధికంగా 1000 పాయింట్లు నష్టపోవటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లను కొత్తవారంలోనూ నష్టాల దిశగా నడిపిస్తున్న కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతలు:
ఇరాన్ ప్రస్తావించిన 7 రోజుల కాల్పుల విరమణ, హోర్ముజ్ జలసంధిని రీస్టార్ట్ చేసే ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ మాత్రం తాము అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడికి తలవంచబోమని, చివరి శ్వాస వరకు పోరాడుతామని తేల్చిచెప్పింది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు శాంతి ఒప్పందం కుదరకపోవడం ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి.

2. భారీగా పెరిగిన ముడిచమురు ధరలు:
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ధరలు ఒక్కసారిగా 2% పెరిగి బ్యారెల్ సుమారు 107 డాలర్లకు చేరాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 107 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్ 94 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ పరిణామాలపై జేపీ మోర్గాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను అంచనా వేయలేకపోతున్నామని, మార్కెట్ దిశపై స్పష్టత లేదని పేర్కొంది.

3. రికార్డు స్థాయిలో బాండ్ ఈల్డ్స్:
అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 2004 తర్వాత తొలిసారిగా 5.2% దాటిపోయాయి. అలాగే 30 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5.5%కి, 2 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.9%కి చేరాయి. బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన డెత్ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల రిస్క్తో కూడిన స్టాక్ మార్కెట్ పై తీవ్ర అమ్మకాల ఒత్తిడి పడుతోంది.

4. రూపాయి విలువ:
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎగబాకడం వంటి కారణాల వల్ల భారత రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 14 పైసలు తగ్గి 95.89కి పడిపోయింది. రూపాయి విలువ త్వరలోనే కీలకమైన 96 మార్కును దాటవచ్చనే భయాలు కరెన్సీ ట్రేడర్లలో వ్యక్తమవుతున్నాయి.

5. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు:
జూలై, ఆగస్టు నెలల్లో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు, ఈ సెప్టెంబర్ నెలలో అమ్మకాల బాటపట్టారు. శుక్రవారం ఒక్కరోజే ఎన్ఎస్ఈ లెక్కల ప్రకారం రూ.3వేల 694 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ.25వేల 682 కోట్ల ఈక్విటీలను విదేశీ మదుపర్లు వెనక్కి తీసుకున్నారు.

6. బలహీనమైన గ్లోబల్ ట్రెండ్స్:
పెరుగుతున్న ఆయిల్ ధరల ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దక్షిణ కొరియా కోస్పి 2% పైగా, చైనా షాంఘై కంపోజిట్ 1.7% పడిపోగా, జపాన్ నిక్కీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది.