మా సమస్యలు పరిష్కరించండి..హైకోర్టు సీజేకు తెలంగాణ న్యాయ శాఖ ఉద్యోగుల వినతి

మా సమస్యలు పరిష్కరించండి..హైకోర్టు సీజేకు తెలంగాణ న్యాయ శాఖ ఉద్యోగుల వినతి

హైదరాబాద్, వెలుగు: న్యాయశాఖ ఉద్యోగులకు సంబంధించిన పలు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ ను  తెలంగాణ న్యాయ శాఖ ఉద్యోగులు కోరారు. ఈ అంశంపై ఆదివారం వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా సర్వీస్ రూల్స్ సవరణలు, న్యాయశాఖ ఉద్యోగులకు జ్యుడీషియల్ ఆఫీసర్లతో సమానంగా మెడికల్ రీయింబర్స్‌‌‌‌మెంట్, జిల్లా న్యాయవ్యవస్థ బిల్లులను గ్రీన్ చానల్‌‌‌‌లో చేర్చడం, కొత్తగా మంజూరైన కోర్టులకు అవసరమైన సిబ్బందిని మంజూరు చేయడం, 14 కొత్త ఫ్యామిలీ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీజే  దృష్టికి తీసుకెళ్లారు.

ఇటీవల 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరైన సందర్భంగా ఏకే సింగ్​ను సన్మానించారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని సీజే హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షురాలు వంశీలత, గోపీనాథ్, సంయుక్త కార్యదర్శులు కొమరయ్య, మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు.