ఆలయంలో అర్థరాత్రి వరకు లౌడ్ స్పీకర్లు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అల్లు శిరీష్.. సోషల్ మీడియాలో దుమారం

ఆలయంలో అర్థరాత్రి వరకు లౌడ్ స్పీకర్లు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అల్లు శిరీష్.. సోషల్ మీడియాలో దుమారం

ఆలయంలో లౌడ్ స్పీకర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నటుడు అల్లు శిరీష్. అర్థరాత్రి దాటినా లౌడ్ స్పీకర్లు మోగుతుండటంపై 2026 సెప్టెంబర్ 27 (ఆదివారం) రాత్రి ఎక్స్ వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా లౌడ్ స్పీకర్ ద్వారా మ్యూజిక్ ప్లే చేస్తుండటం చిన్న పిల్లలకు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి దాటి తెల్లవారు జామున రెండు, మూడు  గంటల వరకు కూడా లడ్ స్పీకర్స్ పెట్టడం ఇబ్బందికరంగా మారిందన్నారు. 

షేక్ పేట్ లోని అపర్ణ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న శిరీష్.. పక్కనే  వినోభా నగర్ లోని హనుమాన్ టెంపుల్ లో గ్యాప్ లేకుండా లౌడ్ స్పీకర్స్ ప్లే చేస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు. గతంలో ఈ విషయంపై ఫిలింగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

అయితే సెప్టెంబర్ 25 వరకు గణేష్ నిమజ్జనం ఉన్నందున.. కొన్నాళ్లు ఓపిక పట్టాల్సిందిగా పోలీసులు కోరినట్లు చెప్పారు. పండగ అయిపోయిందని, నిమజ్జనం ముగిసిందనీ.. అయినా లౌడ్ స్పీకర్ల గోల తగ్గటం లేదని పేర్కొన్నారు. 

లౌడ్ స్పీకర్స్ వలన చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై తమ సొసైటీలోని కొందరు పోలీసులకు చాలా సార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు. 

శిరీష్ ఫిర్యాదుపై హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ స్పందించింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఫిలింనగర్ స్టేషన్ కు ఫార్వార్డ్ చేసినట్లు వివరణ ఇచ్చారు. 

సోషల్ మీడియాలో భిన్న వాదనలు:

శిరీష్ ఫిర్యాదుపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వస్తున్నాయి. శిరీష్ కు గుడిలో లౌడ్ స్పీకర్లే వినిపిస్తున్నాయా.. మసీదుల్లో వినిపించడం లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. శిరీష్ కావాలనే హిందూ సంప్రదాయాన్ని వ్యతిరేకించేలా పోస్టులు పెడుతున్నారని హిందూ సంఘాలకు చెందిన వ్యక్తులు విమర్శిస్తున్నారు. హిందువులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినందుకు ఆయన సినిమాలను బ్యాన్ చేయాలని పిలుపునిస్తున్నారు. 

మరోవైపు శిరీష్ కు మద్ధతుగా కొందరు మాట్లాడుతున్నారు. లౌడ్ స్పీకర్ సమస్య గురించి మాట్లాడితే హిందూ వ్యతిరేకి అనేలా ముద్ర వేయడం తగదని అంటున్నారు. కొందరికి సివిక్ సెన్స్ లేదని.. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనే ఉండదని అంటున్నారు. సౌండ్ పొల్యుషన్ గురించి మాట్లాడితే మతానికి ముడి పెట్టడమేంటని విమర్శిస్తున్నారు.