
సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమేళనంలో మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఇంత ఆదరాభిమానాలు చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది. ఇంత ఉత్సాహం చూస్తుంటే నాకు ఆనందం వేస్తోంది..నా చివరి శ్వాస వరకు మీకు సేవ చేస్తా. నా చర్మం వొలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అంటూ మంత్రి హరీష్ రావు ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తల దయ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సుల వల్ల ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నానన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి..
చింతమడక బిడ్డ వల్ల రాష్ట్రం వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో వర్షాలు లేక కప్ప తల్లి ఆటలు ఆడేవారని..కానీ ఇప్పుడు మండుటెండల్లో చెరువులు మత్తడులు దుంకుతున్నాయన్నారు. 2014 కంటే ముందు పండిన పంటల కంటే తెలంగాణ వచ్చాక ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఎక్కువ పంటలు పండుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలనలో జరిగిన అభివృద్ధి కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన అభివృద్ధే ఎక్కువ అని చెప్పారు.
తెలంగాణకు సహకరించరు..
ప్రధాని మోడీ వచ్చి బురద చల్లే ప్రయత్నాలు చేశారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం సహకరించడం లేదని మోడీ అంటున్నారని..మరి తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందకుండా బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉందని..కానీ అక్కడ ఇప్పటికీ కరెంట్ లేక 20 లక్షల ఆయిల్ ఇంజన్లు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.