
హైదరాబాద్, వెలుగు: స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కు ఇచ్చిన రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గైడ్ లైన్స్ ప్రకారమే వడ్డీ రేటును అమలు చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. రూల్స్ కు విరుద్ధంగా అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా ఎస్‌హెచ్‌జీలకు నెలరోజుల్లో తిరిగి చెల్లించాలని బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో హరీశ్ అధ్యక్షతన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ 35వ సమీక్ష సమావేశం జరిగింది. నిబంధనల ప్రకారం, ఎస్‌హెచ్‌జీలకు రూ. 3 లక్షల లోపు రుణాలకు 7శాతం, రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షలకు వరకు 10 శాతం వడ్డీ రేటు అమలు చేయాలని మంత్రి అన్నారు. ‘‘బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్ స్పెక్షన్, పోర్ట్ ఫోలియో, మెయింటెనెన్స్ వంటి సేవల పేరుతో రూ.500 నుంచి రూ.5000 వరకు చార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే మొబిలైజేషన్, ఎంసీపీ ప్రిపరేషన్, డాక్యుమెంటేషన్, మానిటరింగ్, రికవరీ వంటి సేవలను సెర్ప్ సిబ్బంది నిర్వహిస్తున్నందున బ్యాంకులు ఎస్‌హెచ్‌జీల రుణాలకు చార్జీలను వసూలు చేయొద్దు” అని మంత్రి చెప్పారు.
మాకు వ్యాక్సిన్లు కావాలి
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ను స్పీడప్ చేస్తామని, ఇందుకు వ్యాక్సిన్ డోసులు పంపించాలని కేంద్రాన్ని హరీశ్‌రావు కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల కొవాగ్జిన్, 80వేల కొవిషీల్డ్ డోసులు ఉన్నాయన్నారు. కార్బొవాక్స్ డోసులు అసలే లేవని తెలిపారు. కరోనాపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీశ్ పాల్గొని మాట్లాడారు. ఆక్సిజన్ సప్లైలో కొరత లేకుండా చూడాలని, ప్లాంట్లను దగ్గర్లోని హాస్పిటల్స్‌తో లింక్ చేసేలా మ్యాపింగ్ విధానాన్ని తేవాలని అన్నారు. వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు నిధులివ్వాలని కోరారు.