పాలమూరు‌‌ రంగారెడ్డిపై బీఆర్ఎస్‌‌ చెప్పేవన్నీ అబద్ధాలే

పాలమూరు‌‌ రంగారెడ్డిపై బీఆర్ఎస్‌‌ చెప్పేవన్నీ అబద్ధాలే
  • దమ్ముంటే చర్చకు రావాలని హరీశ్ రావుకు మంత్రి జూపల్లి సవాల్ 
  • గత ప్రభుత్వం దోచుకోవడానికే ప్రాజెక్టులు నిర్మించిందని విమర్శ
  • సోనియా గాంధీ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని వెల్లడి
  • రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ధీమా

హైదరాబాద్, వెలుగు:  పాలమూరు~రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో  బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కేవలం ఒక్క పంపు ఆన్ చేసి ప్రాజెక్టు మొత్తం పూర్తయినట్లు హరీశ్ రావు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు."రూ. 80 వేల కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టులో కేవలం రూ. 25 వేల కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు ఎలా పూర్తి చేస్తారని బీఆర్ఎస్ ను మంత్రి నిలదీశారు.

కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ ఖర్చు

బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులపై  రూ. 7 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే రూ.8,300 కోట్లు ఖర్చు చేశారని జూపల్లి గుర్తు చేశారు. నామా నాగేశ్వరరావు కంపెనీ చేపట్టిన కల్వకుర్తి ప్యాకేజీ 29 పనులు పూర్తి కాకపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్​కు గతంలో  జీవో ఇచ్చి ఇప్పుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.  
కేసీఆర్ సీఎం అయ్యింది సోనియా గాంధీ వల్లే!
సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందువల్లే కేసీఆర్ సీఎం అయ్యారని జూపల్లి అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఇక కల్ల అన్నారు.  రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 


ఉద్యోగులు జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయం

మంత్రి జూపల్లి సత్కారం

హైదరాబాద్, వెలుగు: వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూనే.. కళల పట్ల ఇష్టంతో జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేంద్ర సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక బోర్డు (సీసీఎస్‌‌సీఎస్‌‌బీ) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పతకాలు సాధించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బృందం శుక్రవారం రవీంద్ర భారతిలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీల్లో సత్తాచాటిన తెలంగాణ ఉద్యోగ కళాకారులను అభినందించారు.

అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ ఉద్యోగ కళాకారులకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని తెలిపారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 47 మంది ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వెస్ట్రన్ డ్యాన్స్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన గంధం సంతోష్‌‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వీణ వాయిద్యంలో తృతీయ బహుమతి గెలుచుకున్న డాక్టర్ కె. పృథును, నాటిక (షార్ట్ ప్లే) విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైన ఇంద్రను మంత్రి సత్కరించారు.