కొమరం భీం, అల్లూరి స్పూర్తితో ముందుకెళ్తున్నం

కొమరం భీం, అల్లూరి స్పూర్తితో ముందుకెళ్తున్నం
  • కొమరం భీం, అల్లూరి స్పూర్తితో ముందుకు సాగుతున్నాం
  • వెన్నుమీద కాదు.. గుండెమీద కాల్చమన్న విప్లవ వీరుడు అల్లూరి

హైదరాబాద్: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మనదేశంలో పుట్టినందుకు అందరం గర్వపడాలి అన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ముందుకు సాగుతున్నామన్న కేటీఆర్..గిరిజన హక్కుల కోసం అల్లూరి పోరాడారని చెప్పారు. వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడేనని.. అలాంటి విప్లవ వీరుడు అల్లూరి మనదేశంలో పుట్టినందుకు మనందరికీ గర్వకారణం అన్నారు. కాల్చితే వెన్నుమీద కాదు.. గుండె మీద కాల్చమని ధైర్యంగా చెప్పిన మహానుభావుడు అల్లూరి అని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. జల్... జంగల్... జమీన్ కోసం కొమరం భీమ్ పోరాడారని... బ్రిటిష్ వారిపై అల్లూరి పోరాడారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 8 ఏళ్ళుగా తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. క్షత్రియుల కోసం స్థలం అడిగారని... క్షణం ఆలోచించకుండా మూడు ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారని అన్నారు. త్వరలో భవన నిర్మాణం పూర్తిచేసుకుని దానికి అల్లూరి పేరు పెడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అల్లూరి సీతారామరాజు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, ఉద్యమకారులను సీఎం కేసీఆర్ ఎప్పుడూ మరిచిపోరని చెప్పారు.