యుద్ధం ఆపడం ట్రంప్ చేతుల్లో లేదు.. ఎప్పుడు ముగించాలో తేల్చేది మేమే: ఇరాన్

యుద్ధం ఆపడం ట్రంప్ చేతుల్లో లేదు.. ఎప్పుడు ముగించాలో తేల్చేది మేమే: ఇరాన్
  •  
  • మొజ్తబా ఖమేనీపై ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్
  • ‘మా అగ్ర నాయకత్వం జోలికి వస్తే ట్రంపే పోతడు’ అని వార్నింగ్
  • అమెరికా ప్రెసిడెంట్​కు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్  
  • లారిజానీ తీవ్ర హెచ్చరికలు
  • గొప్ప గొప్ప వాళ్లే ఇరాన్ ను ఏం చేయలేకపోయారని కామెంట్


టెహ్రాన్:  మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ అత్యంత కఠినంగా స్పందించింది. ఈ యుద్ధం ఎప్పుడు ముగియాలో అమెరికా కాదు, తామే నిర్ణయిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) స్పష్టం చేసింది. ప్రాంతీయ సమీకరణాలు, భవిష్యత్తు స్థితిగతులు ఇప్పుడు తమ సాయుధ దళాల చేతుల్లోనే ఉన్నాయని, అమెరికా దళాలు ఈ యుద్ధాన్ని ముగించలేవని ఇరాన్ ధీమా వ్యక్తం చేసింది. అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చేపట్టిన సైనిక చర్యను ఒక ‘చిన్న విహారయాత్ర’గా అభివర్ణించారు. ‘‘మేము పశ్చిమాసియాలోని చెడును అంతమొందించడానికి వెళ్లాము, ఇది చాలా త్వరగా ముగిసిపోతుంది’’ అని ఆయన రిపబ్లికన్ ప్రతినిధులతో పేర్కొన్నారు. అయితే, ఇదే సమయంలో ఆయన ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. ‘‘ఇరాన్ తిరిగి ఒక దేశంగా కోలుకోలేనంతగా ఆ దేశంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాం. వారిపై 
మరణం, అగ్ని మరియు ఆగ్రహం వర్షిస్తాయి’’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

చమురు సంక్షోభం

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అయతుల్లా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టడంతో, ఇరాన్ లొంగిపోయే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనివల్ల చమురు ధరలు 2022 నాటి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే దాదాపు 10 నౌకలపై దాడులు జరగడంతో ప్రపంచ రవాణా దిగ్గజం ‘ఎంఎస్ సీ’ తన ఎగుమతులను నిలిపివేసింది. బహ్రెయిన్, ఖతార్, కువైట్ వంటి 
దేశాలు చమురు ఎగుమతుల్లో అంతరాయం ఏర్పడవచ్చని ‘ఫోర్స్ మజ్యూర్’ (తమ నియంత్రణలో లేని పరిస్థితులు) ప్రకటించాయి.

మా అగ్రనాయకత్వం జోలికొస్తే నువ్వే పోతవ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత మాటల యుద్ధానికి దారితీసింది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ‘‘మొజ్తబా ఖమేనీ” ని ఉద్దేశించి ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తీవ్రంగా స్పందించారు. ‘‘నీకంటే గొప్ప గొప్పవాళ్లే  ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏమీ చేయలేకపోయారు. ముందు నీ భద్రత గురించి జాగ్రత్త పడు, లేదంటే నువ్వే అంతమైపోతావు’’ అని హెచ్చరించారు. అంతకుముందు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. హార్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటూ ప్రపంచాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే కనీవినీ ఎరగని రీతిలో ఇరాన్ పై విరుచుకుపడతామని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ కొత్త నాయకుడిగా మొజ్తబా ఎన్నికపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. "అతను ప్రశాంతంగా జీవిస్తాడని అనుకోవట్లేదు" అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.