హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ కష్టాలు..బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ రూ.2500 పైనే

హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ కష్టాలు..బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ రూ.2500 పైనే
  • నిలిచిన కమర్షియల్ సిలిండర్‌‌‌‌‌‌‌‌ సప్లై..పైనుంచి రావట్లేదంటూ చేతులెత్తేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు
  • మార్కెట్‌‌‌‌లో బ్లాక్​ దందా..  రూ.1900 సిలిండర్‌‌‌‌‌‌‌‌..​ రూ.2,500కుపైనే..
  • ఇలాగైతే హోటల్స్ బంద్ తప్పకపోవచ్చు
  • లక్షలమంది రోడ్డున పడ్తరు: తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ 

హైదరాబాద్​/హైదరాబాద్​సిటీ/పద్మారావునగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇరాన్ యుద్ధం హోటల్, రెస్టారెంట్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో గల్ఫ్​దేశాల నుంచి చమురు, గ్యాస్​సరఫరా తగ్గిపోవడంతో కేంద్రం కమర్షియల్ ఎల్‌‌‌‌పీజీ సిలిండర్ల సరఫరాలో కోతలు పెడ్తున్నది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు  గ్యాస్​ సప్లై నిలిపివేయడంతో  హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం నెలకొన్నది. రాష్ట్రంలో నెలకు 8 లక్షల కమర్షియల్​సిలిండర్లు వినియోగిస్తుండగా.. సుమారు రూ.150 కోట్ల మార్కెట్‌‌‌‌ ఉంది.

కమర్షియల్ సిలిండర్ నిల్వలు తగ్గుముఖం పట్టడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ కష్టాలు షురూ అయ్యాయి. హైదరాబాద్‌‌‌‌లోని పలు రెస్టారెంట్లు మెనూకు పరిమితులు పెట్టుకుంటూ గ్యాస్​వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల సరఫరా మెరుగుపడకపోతే మరో రెండు రోజుల్లో చాలా హోటళ్లు మూతపడి.. ఈ​ రంగంపైనే ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజా పరిస్థితులపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌‌‌‌లో అత్యవసర సమావేశం నిర్వహించి.. గ్యాస్​సప్లై మెరుగుపడకపోతే హోటల్స్​ బంద్​చేయాలన్న యోచనలో ఉన్నట్టు హోటల్, రెస్టారెంట్ సంఘాలు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడ్తున్నది.

నిలిచిపోయిన దిగుమతులు

మన ఎల్‌‌‌‌పీజీ అవసరాల్లో 62 శాతం వరకు దిగుమతులే ఆధారం. యుద్ధం వల్ల హార్ముజ్​ జలసంధిలో నౌకలు స్తంభించి భారత్‌‌‌‌కు దిగుమతులు నిలిచిపోవడంతోపాటు సౌదీ అరేబియా, ఖతార్ నుంచి కూడా సరఫరా ఆగిపోయింది. దీంతో కేంద్రం కమర్షియల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ రంగాలకు ఎల్‌‌‌‌పీజీ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ గృహ వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ రిఫైనరీల్లో ఎల్‌‌‌‌పీజీ ఉత్పత్తిని పెంచింది. డొమెస్టిక్ రీఫిల్ బుకింగ్ గడువును 21 నుంచి 25 రోజులకు పొడిగించి, హాస్పిటల్స్, స్కూళ్లు, హాస్టళ్లలాంటి అత్యవసర సంస్థలకు మాత్రమే కమర్షియల్ సప్లై కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

బ్లాక్​ దందా షురూ.. 

ఎల్‌‌‌‌పీజీ కొరతతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి కమర్షియల్​ సిలిండర్ల సప్లై సగానికి తగ్గింది. దీనికి తోడు అక్రమార్కులు బ్లాక్​ దందా మొదలుపెట్టారు. 19 కేజీల కమర్షియల్​ గ్యాస్ సిలిండర్‌‌‌‌ ధర రూ.1,800 ఉండగా రెండురోజుల కింద రూ.114 పెరిగింది. కానీ అక్రమార్కులు ఒక్కో సిలిండర్‌‌‌‌కు రూ.2,500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్​ మీద దాదాపు రూ.600 ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తున్నదని హోటల్​ యజమానులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కమర్షియల్ కనెక్షన్లు 2 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్ల వినియోగం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల సిలిండర్ల డిమాండ్​ ఉంటుంది.

 హోటల్స్ అసోసియేషన్ ఆందోళన 

 కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేతపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. హోటల్స్, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో సభ్యులు సికింద్రాబాద్‌‌‌‌లో మంగళవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ​గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజులుగా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయని, ప్రస్తుతం సరఫరా కూడా నిలిచిపోయిందన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదని, ఇక నుంచి సరఫరా కష్టమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారన్నారు. గ్యాస్ సరఫరా లేకపోతే హోటల్ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రత్యామ్నాయం చూపించాలి..

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో హోటల్స్, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా ఆగిపోయింది.   గ్యాస్ ధరలు పెంచారు. డిస్ట్రిబ్యూటర్లు ఇక నుంచి గ్యాస్ సరఫరా కష్టమే అంటున్నారు.  ఇలాగైతే లక్షలాది మంది రోడ్డున పడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి, ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లను బంద్ చేసే యోచనలో ఉన్నాం. వెంకట్‌‌‌‌రెడ్డి , అధ్యక్షుడు, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ 

హాస్టల్స్ , హాస్పిటల్స్‌‌‌‌కు ఫస్ట్ ప్రయారిటీ 

ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్‌‌‌‌ కొరత ఉన్నమాట నిజమే. అందువల్లే ఎమర్జెన్సీ సర్వీసులైన పిల్లల హాస్టల్స్, హాస్పిటల్స్‌‌‌‌కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. ఇప్పటివరకైతే హోటల్స్‌‌‌‌, రెస్టారెంట్లకు10 శాతానికి మించి ఇబ్బంది రాలేదు. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి అనవసర గ్యాస్ వాడకాన్ని తగ్గించుకోవాలని వ్యాపారులకు, వినియోగదారులకు చెప్తున్నాం. - రామకృష్ణ రాజు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు, వరంగల్

కట్టెల పొయ్యి పెట్టుకొమ్మంటున్నరు..

మా టిఫిన్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో రోజుకొక  సిలిండర్ పడుతుంది. గ్యాస్‌‌‌‌ కొరత ఉందని తెలిసి.. ఏజెన్సీ వాళ్లను అడిగితే కరీంనగర్ లో ప్రస్తుతం స్టాక్ ఉన్న  కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇంకో 3, 4 రోజుల వరకే సరిపోతాయంటున్నారు. కట్టెల పొయ్యిలు పెట్టుకోండని చెప్తున్నారు. - సురేశ్‌‌‌‌, స్వాగత్ హోటల్, టవర్ సర్కిల్, కరీంనగర్

క్యాటరింగ్​ బిజినెస్‌‌‌‌పై ప్రభావం

కమర్షియల్​గ్యాస్​ సిలిండర్ల సరఫరా నిలిపి వేయడంతో మా క్యాటరింగ్​ వ్యాపారంపై ప్రభావం పడింది. ప్రతి ఏటా పెళ్లిళ్ల సీజన్​ మాకు పండగలా ఉండేది. కానీ ఈసారి మాత్రం చాలా ఆర్డర్లను వదులుకుంటున్నాం. ఒక పక్క ధరల పెరుగుదల భారం కాగా ఇప్పుడు సిలిండర్​ సరఫరా నిలిపి వేయడం వల్ల మా వ్యాపారం తగ్గింది.- శిరీశ్​కుమార్​, క్యాటరింగ్​ వ్యాపారం, మణికొండ

ఒక్కో సిలిండర్‌‌‌‌పై.. రూ.700 ఎక్స్‌‌‌‌ట్రా

నాది చిన్న హోటల్‌‌‌‌. నిన్న మొన్నటి వరకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌‌‌‌‌‌‌‌కు రూ.1800 చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం పేరుతో గ్యాస్ ఇబ్బందులు ఉన్నాయని ఒక్కో సిలిండర్‌‌‌‌‌‌‌‌కు రూ.2500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక్కో  గ్యాస్ బండ మీద రూ.700 ఎక్కువ చెల్లించాలి అంటే వ్యాపారం గిట్టుబాటు కాదు.- కె.ప్రవీణ్, హోటల్ యజమాని, హనుమకొండ