- హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ ఎట్ల మోసం చేసిందో సభలో ఎండగడతం: కేటీఆర్
- ఆరు గ్యారంటీలు, 420 హామీలకు ప్రభుత్వం డబ్బులు లేవంటున్నది
- మూసీ సుందరీకరణకు మేం
- వ్యతిరేకం కాదు.. పేదల ఇండ్ల కూల్చివేతకే వ్యతిరేకమని వెల్లడి
- అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలు,
- ఎమ్మెల్యేలకు ఓరియెంటేషన్
హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీల అమలుపై ప్రజలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, రైతన్నలు సహా సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు ఆయా వర్గాల ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రైవేట్బిల్లు పెడతామని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ బిల్లుకు మద్దతిచ్చి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఓరియెంటేషన్ నిర్వహించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముఖ్యమైనవని, ప్రభుత్వం పెడుతున్న మూడో బడ్జెట్అని చెప్పారు.
ప్రభుత్వ పదవీకాలం సగం పూర్తయిందని, హామీల అమలుకు ప్రజలు ఇచ్చిన వ్యవధి కూడా అయిపోయిందని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు, 420 హామీల అమలుకు, రైతన్నలు, మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలకు డబ్బులు లేవంటున్నది. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి మూసీ పేరుతో అవినీతి కార్యక్రమానికి తెరలేపింది. మేము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు. మూసీలో లక్షన్నర కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని, లక్షలాది మంది ఇండ్లను కూలగొట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం లేదు. కేవలం ఢిల్లీకి డబ్బులు పంపించడం కోసమే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వ్యాల్యూ చేయడం కాదు.. అసలు జీరో వ్యాల్యూ ఎవరికైనా ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డికే. డే ఎకానమీని నాశనం చేసిన వ్యక్తి నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు’’ అని కేటీఆర్ విమర్శించారు.
అసెంబ్లీలోనూ బుల్డోజర్ టాక్టిక్స్
రాష్ట్రంలో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపి ఇండ్లను కూలగొట్టినట్టే.. అసెంబ్లీలోనూ మందబలంతో బుల్డోజర్స్ టాక్టిక్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగిస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ, మండలి సమావేశాల్లో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ సభను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి.. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టారని ఆరోపించారు. రైతుబంధు అమలు చేయకుండా రాహుల్బంధును అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ దాష్టీకంతో ఖమ్మంలో ఇండ్లు కోల్పోయిన వెలుగుమట్ల ప్రజలు, మూసీ బాధితులు, పేద దళిత గిరిజనుల తరఫున అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ‘‘ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయడం లేదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మా పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారు. ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు. స్టాండింగ్ కమిటీ లేదు.. పిటిషన్స్ కమిటీ లేదు. డిప్యూటీ స్పీకర్ కూడా అసెంబ్లీలో లేరు’’ అని విమర్శించారు.
