స్క్రాప్ అమ్మకం ద్వారా రైల్వేకు రూ. 602.06 కోట్లు

స్క్రాప్ అమ్మకం ద్వారా రైల్వేకు రూ. 602.06 కోట్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే 2025–-26 ఆర్థిక సంవత్సరానికి  రైల్వే బోర్డు స్క్రాప్ అమ్మకంపై  నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి రూ.602.06 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 510 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా దానికి మించి ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.  ‘మిషన్ జీరో స్క్రాప్’ ఈ –మిషన్ మోడ్  ప్రకారం ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు స్క్రాప్ (తుక్కు)నిల్వలు పేరుకుపోకూడదు.

రైల్వే వివిధ డిపోలలో పేరుకుపోయిన స్క్రాప్‌‌‌‌ను సమీకరించి దేశం వ్యాప్తంగా కొనుగోలుదారులకు ఈ-వేలం ద్వారా విక్రయిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో  100 శాతం  పారదర్శకతను పాటిస్తూ మొత్తం 1,32,583 మెట్రిక్ టన్నుల స్క్రాప్​ను విక్రయించింది. పేరుకుపోయిన స్క్రాప్‌‌‌‌ను అమ్మడం భారత ప్రభుత్వ ‘స్వచ్చభారత్ మిషన్’కు ఎంతో దోహదపడిందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం  రైల్వే స్క్రాప్‌‌‌‌ను రూ.501.72 కోట్లకు విక్రయించగా  ఈ సంవత్సరం గత అమ్మకాలకు అదనంగా రూ.100 కోట్లకు పైగా అధిగమించి రైల్వే చరిత్రలో అత్యధిక రికార్డు స్ధాయిలో అమ్మకాలు సాధించింది.