- హైదరాబాద్ రెవెన్యూ డివిజన్‌పరిధిలో 14 వేల ఇండ్లకు జారీ
- కేటాయించి ఏండ్లు గడుస్తున్నా ఇండ్లలో ఉండని లబ్ధిదారులు
- ఎందుకు ఉండట్లేదో వారం రోజుల్లో చెప్పాలని ఆదేశాలు
- లేదంటే వెయిటింగ్ లిస్టులో ఉన్న అర్హులకు కేటాయిస్తామని వెల్లడి
- జంటనగరాల్లో 30 వేల మందికిపైగా ఉండటం లేదని గుర్తించిన హౌసింగ్ ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో కొందరు లబ్ధిదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇల్లు మంజూరు చేసి మూడేండ్లు గడుస్తున్నా.. వాటిలో నివాసం ఉండటం లేదని హౌసింగ్ అధికారుల సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వేల ఇండ్లకు ఇంకా తాళాలు వేసే ఉన్నాయి. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం.. ఇండ్లు పొంది ఖాళీగా పెట్టిన వారు వెంటనే వెళ్లి ఉండాలని, లేదంటే కేటాయింపును రద్దు చేసి, నిజమైన అర్హులకు ఆ ఇండ్లను ఇస్తామని హెచ్చరిస్తూ ఆర్డీవోల ద్వారా నోటీసులు జారీ చేస్తోంది. హైదరాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలో 14 వేల మంది లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
70 వేల ఇండ్లు కేటాయింపు
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రభుత్వం వేల సంఖ్యలో డబుల్ బెడ్రూం టౌన్ షిప్ లను నిర్మించింది. జీహెచ్ ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లను గత ప్రభుత్వం మంజూరు చేయగా.. 70 వేల ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు. అయితే, వీటిలో 40 వేల ఇండ్లలోనే లబ్ధిదారులు ఉంటున్నారని, మిగతా 30 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఈసీఐఎల్ పరిధిలో ఉన్న రాంపల్లిలోని డబుల్ బెడ్రూం కాలనీలో హౌసింగ్ అధికారులు ఎస్పీడీసీఎల్ అధికారులను సంప్రదించి కరెంట్ బిల్లులు సేకరించారు. మినిమం కంటే తక్కువ బిల్లు వచ్చిన ఇంట్లో లబ్ధిదారులు ఉండటం లేదని తేల్చారు. రాంపల్లిలో మొత్తం 4 వేల ఇండ్లు ఉండగా.. వీటిలో సుమారు 2 వేల మంది ఉండటం లేదని సర్వేలో తేలింది. ఇక పఠాన్ చెరు శివారులో నిర్మించిన కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 15,500 ఇండ్లతో మెగా టౌన్ షిప్ ను నిర్మించింది. ఇందులో నాంపల్లి, చార్మినార్, గోషామహల్ తో పాటు ఇతర నియోజకవర్గాల పేదలకు ఇండ్లు కేటాయించింది. అయితే, కొల్లూరు దూరం కావటం, అక్కడ ఉపాధి దొరకటం లేదని పబ్లిక్ ఉండటం లేదు. కొల్లూరు టౌన్ షిప్ లో 50 శాతం డబుల్ బెడ్రూం ఇండ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు అంటున్నారు.
దరఖాస్తు చేసుకున్న పబ్లిక్ కు డబుల్ ఇండ్లు
డబుల్ ఇండ్లలో ఉండని లబ్ధిదారుల ప్లేస్ లో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న పబ్లిక్ కు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. లాటరీ ద్వారా ఇండ్లు పొందిన లబ్ధిదారులు వాటిలో ఎందుకు ఉండటం లేదని మంత్రులు ఆరా తీశారు. ఖాళీగా ఉన్న ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
వారం రోజుల్లో వివరణ ఇవ్వండి
అంబర్ పేట, ఎల్ బీ నగర్ నియోజకవర్గాలకు చెందిన ఇండ్లు లేని పేదలకు మేడ్చల్ జిల్లాలోని ప్రతాప్‌సింగారం పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు. ఇక్కడ 2,200 ఇండ్లు ఉండగా ఇందులో సుమారు 1,800 మందికి ఇండ్లు కేటాయించారు. వీటిలో చాలా మంది లబ్ధిదారులు ఉండటం లేదని తేలటంతో అధికారులు ఇంటి డోర్లకు నోటీసులు అంటించారు. ‘మీకు కేటాయించిన ఫ్లాట్ లో మీరెందుకు నివాసం ఉండటం లేదో వారం రోజుల్లోగా రాతపూర్వకంగా మాకు వివరణ ఇవ్వాలి. ఒకవేళ మీరు సరైన కారణం చెప్పకపోతే.. మీ కేటాయింపును రద్దు చేసి, నిబంధనల ప్రకారం వేరే అర్హులైన పేదలకు ఆ ఇల్లును కేటాయిస్తాం’ అని నోటీసులో స్పష్టం చేశారు.
నోటీసులు ఇచ్చాం.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డబుల్ ఇల్లు తీసుకొని నివాసం ఉండని వారికి నోటీసులు ఇచ్చాం. గతంలో 21 వేల మందికి నోటీసులు ఇవ్వగా ఇందులో 7 వేల మంది ఇండ్లలోకి వచ్చారు. ఇపుడు 14 వేల మందికి నోటీసులు ఇచ్చాం. ఇండ్లలో ఉంటరా? ఉండరా? రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వాలా? అని వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నాం. వివరణ వచ్చిన తరువాత ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తాం.
- రెవెన్యూ అధికారి, హైదరాబాద్ జిల్లా
ఇండ్లలోకి వచ్చి ఉండండి..
ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించి మూడేండ్లవుతున్నది. ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో ఇండ్లలోకి రాలేదు. దీనిపై గతంలో అధికారులు సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఆధారంగా.. ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. లబ్ధిదారులు ఇండ్లలోకి ఎందుకు రాలేదో.. అధికారులకు సరైన వివరణ ఇస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పటికైనా లబ్ధిదారులు ఇండ్లలోకి వచ్చి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను సద్వినియోగం చేసుకోవాలి. - బద్దం కుమార్, ఇందిరమ్మ కమిటీ మెంబర్, ప్రతాప్ సింగారం
