నిరుద్యోగ మిలియన్ మార్చ్.. ఉద్రిక్తం జేఏసీ నాయకుల అరెస్ట్

నిరుద్యోగ మిలియన్ మార్చ్.. ఉద్రిక్తం జేఏసీ నాయకుల అరెస్ట్

దిల్​సుఖ్​నగర్, వెలుగు: రెండు లక్షల ఉద్యోగాల సాధనకు నిరుద్యోగ జేఏసీ మంగళవారం తలపెట్టిన మిలియన్ మార్చ్ ఉద్రిక్తతకు దారి తీసింది. జేఏసీ పిలుపుతో మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు మంగళవారం దిల్​సుఖ్​నగర్ రాజీవ్ చౌక్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. కాలనీల నుంచి నిరుద్యోగులు ప్రధాన రహదారికి రాకుండా పికెట్లు ఏర్పాటు చేసి, కీలక నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

రాజీవ్ చౌక్ వరకు ర్యాలీగా వచ్చిన కొందరిని సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండడంతో విద్యార్థులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, ఇన్​స్పెక్టర్ సైదిరెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. అదుపులోకి తీసుకున్న నాయకులను సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు.