- ఉపాధి పథకం పేరు మార్పు సిగ్గుచేటు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్ర్య ఫలాలు అందించిన మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం జాతి పితను అవమానించడమేనని, ఇది కేంద్ర పాలకుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. పేదలకు అండగా నిలిచేందుకు 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ చారిత్రాత్మక చట్టాన్ని పదేండ్లుగా నీరుగారుస్తున్న బీజేపీ సర్కార్.. తాజాగా లోక్‌సభలో బలవంతంగా ఆమోదించుకున్న కొత్త బిల్లుతో పేదల పొట్టకొట్టిందని గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
పేరు మార్చినంత మాత్రాన కేంద్రం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేదని, గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా అని నిలదీశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ పథకాన్ని ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్’గా మారుస్తూ, నిధుల భారాన్ని 40 శాతం రాష్ట్రాలపై నెట్టడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
